చైనా డిగ్రీలకు భారత్లో గుర్తింపుపై చర్చలు
బీజింగ్: భారతదేశ డిగ్రీలకు చైనాలో, చైనా డిగ్రీలకు భారత్లో గుర్తింపునిచ్చే దిశగా ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, చైనా మంత్రి యాంగ్ గురియన్తో ఈ విషయంపై కీలక చర్చలు జరిపారు. అలాగే, ఉన్నత విద్యలో సహకారాన్ని పెంపొందించుకునే దిశగా.. ఇరుదేశాల ఉన్నత విద్యా సంస్థలతో ఒక కన్సార్షియంను ఏర్పాటు చేయాలనే విషయంపై కూడా వారు చర్చించారు.
4 రోజుల పర్యటనకు గానూ ఇరానీ చైనా వెళ్లిన విషయం తెలిసిందే. చైనా ప్రభుత్వం, యునెస్కో సంయుక్తంగా నిర్వహించిన ‘2015 తరువాత విద్యారంగం’ అనే అంశపై శనివారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆమె పాల్గొన్నారు. చైనా మంత్రి యాంగ్ గురియన్తో చర్చల సందర్భంగా.. ఉపాధ్యాయుల శిక్షణలో పరస్పర సహకారంపై ఒక ఒప్పందానికి వచ్చారు. దాదాపు 13 వేల మంది భారతీయ విద్యార్థులు ప్రస్తుతం చైనాలో చదువుకుంటున్నారు. వారిలో అత్యధికులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.