అమరావతికి అండాదండ
చైనా బృందం వెల్లడి
సీఆర్డీఏ అధికారుల బేటీ
విజయవాడ : నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు వచ్చిన చైనా ప్రతినిధి బృందంతో సోమవారం విజయవాడలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) కార్యాలయంలో అధికారులు సమావేశమయ్యారు. ఏపీ సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, కలెక్టర్ బాబు.ఎ, నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండియన్తో చైనాకు చెందిన జీఐఐసీ (గ్విజో మారిటైం సిల్క్రూట్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్) ప్రణాళిక, డిజైనింగ్, వ్యాపార రంగ నిపుణుల బృందం సభ్యులు సమావేశమయ్యారు. ఈ బృందానికి నేతృత్వం వహించిన జీఐఐసీ ఉపాధ్యక్షుడు చీఫ్ ఇంజినీర్ గువాన్ గ్జియోక్వింగ్ మాట్లాడుతూ.. నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. దానికి అణుగుణంగా తుది బృహత్ ప్రణాళిక రూపకల్పనలో ఇండస్ట్రియల్ ప్లానింగ్, పవర్ ప్లానింగ్, ఇన్ఫ్రాస్టక్చర్ ప్లానింగ్ అంశాల్లో సహకరించేందుకు అనుభవజ్ఞులైన నిపుణులతో తమ బృందం వచ్చిందని చెప్పారు. సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి రాజధాని అమరావతి కీలకంగా మారుతుందని చెప్పారు.
బౌద్ధ ధర్మానికి వారసత్వ నగరంగా అమరావతి పేరుగాంచిందని, చక్కని ప్రణాళికతో నిర్మాణం కానుందని పలువురు అధికారులు చైనా బృందానికి వివరించారు. జీఐఐసీ ప్లాన్ అండ్ డిజైన్ బృందానికి చెందిన పర్యావరణ పరిరక్షణ నిపుణులు యాంగ్ చాంగ్లీ, షాంగ్ కాయ్, పవర్ ప్లానింగ్ నిపుణులు ల్యూఈ, పవర్ సిస్టమ్స్ ప్లానింగ్ నిపుణులు లీజీ, మున్సిపల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్లానింగ్, వాటర్ సప్లయి, డ్రైనేజీ విభాగం నిపుణులు వాంగ్ గోడోంగ్, ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ నిపుణులు లీషియాన్, ఇండస్ట్రియల్ ప్లానింగ్ నిపుణులు తాంగ్ షిబిన్, జ్యూ రుయ్, వాణిజ్య బృందం సభ్యుడు జీఐఐసీ భారత ప్రతినిధి న్యు పేయ్ పాల్గొన్నారు.