న్యూఢిల్లీ: భారత్‌లో అత్యంత వైభవంగా జరిగిన జీ20 సమావేశాలకు దాదాపు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశాలు విజయవంతంగా ముగిశాక వారంతా తమతమ దేశాలకు తిరిగి పయనమయ్యారు. అయితే సమావేశాలు ముగిసిన మూడు రోజులకు ఢిల్లీ తాజ్‌లో జరిగిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. జీ20 సమావేశాల్లో హాజరయ్యేందుకు వచ్చిన చైనా ప్రతినిధుల బృందం బ్యాగుల్లో అనుమానాస్పద పరికరాలు కనిపించడంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని నిలదీయగా బ్యాగులను స్కాన్ చేయడానికి నిరాకరించారు. భారత అధికారులు జోక్యం చేసుకున్నాక 12 గంటల పాటు సాగిన ఈ హైడ్రామాకు తెరపడింది.
సమావేశాల సమయంలో చైనా ప్రతినిధుల బృందం తాజ్ ప్యాలెస్‌లో బస చేశారు. హోటల్ కు వస్తూనే వారి బ్యాగులను తనిఖీ చేయగా రెండు బ్యాగుల్లో అనుమానాస్పద పరికరాలు కనిపించడంతో వారిని అక్కడే నిలిపివేశారు తాజ్ సెక్యూరిటీ సిబ్బంది. ఆ రెండు బ్యాగులలో దౌత్య సంబంధమైన సామాన్లు ఉన్నట్లు చైనా బృందం వెల్లడించగా అనుమానమొచ్చి హోటల్ సెక్యూరిటీ బ్యాగులను స్కానర్ పై ఉంచాల్సిందిగా కోరారు. అందుకు వారు నిరాకరించడంతో 12 గంటలపాటు పెద్ద డ్రామా నడిచింది.
పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. చివరికి అధికారులు కల్పించుకున్నాక వారి లగేజీని చైనా ఎంబసీకి తరలించడానికి వారు అంగీకరించడంతో హైడ్రామాకు తెరపడింది. భారత్‌లో జరిగిన ఈ సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గైరుహాజరవ్వగా ఆయన స్థానంలో చైనా ప్రీమియర్ లీ కియాంగ్ చైనా ప్రతినిధిగా హాజరయ్యారు. ఢిల్లీ తాజ్ హోటల్‌లో బస చేసిన చైనా ప్రతినిధి బృందానికి ఆయనే నాయకత్వం వహించారు.
ఇది కూడా చదవండి: Libya Floods: లిబియాలో వరద బీభత్సం
Comments
Please login to add a commentAdd a comment