ఆ పతనం మనకో పాఠం
చైనా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నేలమట్టమైతే మాత్రం భారత్‌కు లాభం కాదు. అది మందగిస్తేనే ఎక్కువ ప్రయోజనం. స్టాక్ మార్కెట్ పతనం వల్ల ఏం చేయడానికీ అక్కడి నేతలకు కూడా పాలుపోవడం లేదు. గత నెలలో సంభవించిన చైనా ఆర్థిక సంక్షోభం ప్రపంచం దృష్టి ని ఆకర్షించింది. 1990 నుంచి చైనా ఆర్థిక ప్రగతి అనే నిచ్చె నను అద్భుతమనిపించే రీతిలో అధిరోహించింది. ప్రపంచంలో ఇప్పుడు అమెరికా తరువాత చైనాయే అతి పెద్ద ఆర్థికవ్యవస్థ. ఎల్లో రేస్ అంటేనే శ్వేతజాతీయులు అవహేళన చేసేవారు. కానీ చైనా పురోగతి ఆ విమర్శ కుల నోళ్లు మూయించడమే కాదు, భయపెట్టింది కూడా. ప్రపంచం నలుమూలలా ఇప్పుడు చైనా ఉంది. సుదూరంగా ఉన్న అమెరికా, యూరప్‌లకు చైనాను చూస్తే కలవరం. ఆ దేశానికి పొరుగున భారత్ ఉంది. అయినా 1958 నుంచి చైనాతో భారత్ సంబంధాలు సజా వుగా లేవు. కాబట్టి చైనా ఎదుగుదల భారత్‌ను ఎంత భయకంపితం చేస్తుందో ఊహించవచ్చు.
చైనా సాలుకు 850 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేస్తుంది. భారత్ 80 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తుం ది. భారత్‌కున్న విద్యుదుత్పాదనా సామర్థ్యంకంటే చైనా ఐదు రెట్లు ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంది. చైనా 2011, 2012 సంవత్సరాలలో చేసిన సిమెంట్ ఉత్పత్తి, 20వ శతాబ్దం మొత్తం (1900-2000) అమెరికా చేసిన సిమెం ట్ ఉత్పత్తి కంటే ఎక్కువ. చైనాలో ఆర్థిక క్షీణత ఆరంభం కావడంతోనే చాలా దేశాలు తమ భవిష్యత్తును గురించి ఆందోళన పడడం మొదలు పెట్టాయంటే, ప్రస్తుత ప్రపం చంలో చైనా ఎంత పెద్ద వ్యవస్థగా ఎదిగిందో అర్థం చేసు కోవచ్చు. భారత్-చైనాలు 1990 నుంచే ఆర్థిక సంబం ధాలను మెరుగు పరుచుకోవడం మొదలైంది.
సరిహద్దు ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత్‌కు ఉన్న అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనాయే. ఏటా 65 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు చైనా నుంచి భారత్‌కు వస్తున్నాయి. అయితే అక్కడికి జరుగుతున్న ఎగుమతుల విలువ 16 బిలియన్ డాలర్లే. గడచిన ఆరు దశాబ్దాలుగా చైనా ఆర్థిక వ్యవ హారా లకు మించి అనేక విధాలుగా భారత్‌ను ఇబ్బందులకు గురి చేసింది. 1962 యుద్ధం భారత్‌కు భారీ నష్టాన్నే మిగి ల్చింది. ప్రపంచం ముందు తలవంచుకోవలసి వచ్చింది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చాణక్యుని నీతిసూత్రం ఆధారంగా భారత్ వ్యతిరేక దేశాలకు చైనా మద్దతు ఇవ్వ డం మొదలుపెట్టింది. భారత్‌ను ఇరకాటంలో పెట్టడానికీ, వేధించడానికీ పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు పలు సందర్భాలలో మద్దతు ఇచ్చింది. అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోవడానికి పాకిస్తాన్‌కు సాయంచేసిన దేశం చైనాయే. ఆ పాకిస్తాన్ ఏకైక శత్రువు భారత్. మన విదేశాం గ నీతి మొత్తం చైనాను దృష్టిలో పెట్టుకుని రూపొందించి నదే. పాకిస్తాన్‌కు చైనా మద్దతు ఇవ్వకుంటే, భారత్‌కు ఊపిరి సలుపుతుంది. చైనా తరుచుగా ‘పాకిస్తాన్‌తో మైత్రి హిమాలయాలకంటే ఉన్నతమైనది. హిందూ మహాసము ద్రం కంటే లోతైనది’ అని ప్రకటిస్తూ ఉంటుంది.
ఈ నేపథ్యంలో చైనా ఆర్థిక వ్యవస్థలో క్షీణత భార త్‌కు ఏ విధంగా ఉపకరించగలదన్నదే ప్రశ్న. చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడం వల్ల చమురు, బొగ్గు, రాగి, జింక్ వంటి వాటి ధరలు దిగివస్తాయి. గతంలో ప్రపంచంలో అధిక మొత్తంలో చమురు నిల్వలను కొనుగోలు చేసిన చైనా ఇప్పుడు వెనకబడుతోంది. దీనితో చమురు మార్కె ట్ పతనమవుతుంది. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం భారత్‌కు ఉపయోగపడుతుంది. చైనా ఆర్థిక వ్యవస్థ క్షీణత స్టాక్ మార్కెట్ పతనానికి దారి తీసింది. ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి ఈ పాతికేళ్లలో తొలిసారి చైనా తన కరెన్సీ విలువను తగ్గించింది. దీనితో ఆ దేశం నుంచి జరిగే ఎగుమతులు చౌక అవుతాయి. మునుపెన్నడూ లేన ట్టు చైనా ఉక్కు, సిమెంట్ ధరలు 25 శాతం తగ్గడం గమ నించాలి. నిర్మాణ వ్యయం 25 శాతం తగ్గితే భారత్ ఇతో ధికంగానే లాభపడుతుంది.
భారత్‌తో వైరం ఉన్న ఇరుగుపొరుగుకు మునుపటి వలే చేయూతనివ్వడానికి కావలసినంత డబ్బు ఇప్పుడు చైనా దగ్గర లేదు. రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు, సహజవాయువుల కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందా ల మీద చైనా సంతకాలు చేసింది. ఇప్పుడు ఇలాంటి ఒప్పందాలకు స్వస్తి పలకడంతో రష్యా కూడా దిగాలుప డుతోంది. ఎవరైనా ధనికుడైన మిత్రుడంటేనే మక్కువ చూపుతారు. అందుకే ఇప్పుడు చాలా దేశాలు చైనా అంటే ముఖం చాటేస్తున్నాయి.
దేశ ఉత్తర ప్రాంత ఇస్లామిక్ ఉగ్రవాదంతో చైనా సత మతమవుతోంది. దానిని అణచివేయాలని ప్రయత్నిస్తున్న ది కూడా. నిజానికి ఇండియా కాకుండా వియత్నాం, ఫిలి ప్పీన్స్, థాయ్‌లాండ్, జపాన్, కొరియాలతో చైనాకు సమ స్యలు ఉన్నాయి. ఆర్థికంగా బలహీనపడడంతో చైనా ఇప్పుడు బహుముఖంగా పోరాడలేదు. గత ఏడాది చైనా కు 300 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తా యి. చైనా ఆర్థికవ్యవస్థ బలహీనపడితే విదేశీ పెట్టుబడులు ఇండియా వైపు మళ్లుతాయి. పలు చైనా కంపెనీలు కూడా ఇండియా వైపు చూస్తాయి. ఇందుకు మంచి ఉదాహరణ- ఫాక్స్కూన్. ఇది ఇండియాలో పది కర్మాగారాలను నెల కొల్పింది. ఏపిల్ ఫోన్లు, ఐపాడ్ల ఉత్పత్తిలో దీనిదే ప్రధాన పాత్ర. వీటిలో 2 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇలాంటి తక్షణ లాభాలు భారత్‌కు సమకూరతాయి.
అయితే చైనా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నేలమట్టమైతే మాత్రం భారత్‌కు లాభం కాదు. అది మందగిస్తేనే ప్రయోజనం. అయితే ఈ సంక్షోభాన్ని నేతలు ఏదో విధం గా పరిష్కరిస్తారన్న నమ్మకం ఉండేది. తీరా స్టాక్ మార్కె ట్ పతనం వల్ల ఏం చేయడానికీ అక్కడి నేతలకు కూడా పాలుపోవడం లేదు. కానీ ఈ సమస్యను పరిష్కరించలే కుంటే చైనా చిక్కుల్లో పడుతుంది. టిబెట్, ఉత్తర ప్రాంత ముస్లింలు తిరగబడే అవకాశాలు ఉన్నాయి. దీని నుంచి ఆ దేశం ఎలా గట్టెక్కుతుందో ఇప్పుడే చెప్పలేం. బయట పడినా నష్టాన్ని పూడ్చుకోవడానికి చాలా సమయమే కావాలి. ఈ సమస్యలన్నీ మౌలిక వసతుల కల్పనకు మితి మీరి ఖర్చు చేసిన ఫలితమేనని భారత్ గ్రహించడం అత్యవసరం. దీనినీ గుణపాఠంగా గ్రహించాలి.
- పెంటపాటి పుల్లారావు
(వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు)
e-mail:Drpullarao1948@gmail.com