చిందాడ‘గొడవ’
ఇరువర్గాల ‘తమ్ముళ్ల’ తన్నులాట
పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, ఇంటి కిటికీల
అద్దాలు, మోటారు సైకిళ్లు ధ్వంసం
9 మందిపై కేసు నమోదు
అమలాపురం రూరల్ :
మండలంలోని చిందాడగరువు గ్రామంలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీకి చెందిన ఫ్లెక్సీలు, జెండాలను అదే పార్టీకి చెందిన గ్రామంలోని కొందరు కార్యకర్తలు ధ్వంసం చేశారు. అంతటితో ఆగక ఓ టీడీపీ నాయకుని ఇంటిపై పార్టీ కార్యకర్తలు దాడి చేసి కిటికీ అద్దాలు పగలగొట్టడమే కాక, నాలుగు మోటారు సైకిళ్లను ధ్వంసం చేశారు. గ్రామంలో ఒకే పార్టీకి చెందిన తెలుగు తమ్ముళ్లు కుమ్ములాటకు దిగడంతో మండలంలోని ఆ పార్టీ శ్రేణులు ముక్కున వేలేసుకున్నాయి. పార్టీ ఫ్లెక్సీల వల్ల రగిలిన గొడవ వివరాలు ఇలా ఉన్నాయి. టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మాదిరెడ్డి వెంకట్రావు, అదే గ్రామానికి చెందిన జిల్లా టీడీపీ నాయకుడు మట్ట మçహాలక్ష్మి ప్రభాకర్ అనుచరుడు, పార్టీ కార్యకర్త పొణకల గణేష్ మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో నూతన సంవత్సరం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి రాజప్ప, ఎమ్మెల్యే ఆనందరావుల ఫొటోలతో శుభాకాంక్షలు తెలుపుతూ గణేష్ గ్రామంలో రెండు రోజుల కిందట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకట్రావు కుమారుడు మణికంఠ స్నేహితుడు, పార్టీ కార్యకర్త తూము శివాజీ ధ్వంసం చేశాడు. ఇదే సమయంలో మణికంఠ కూడా రాజప్ప, ఆనందరావు ఫొటోలతో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను గణేష్ వర్గం ధ్వసంచేసింది. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. నివురు గప్పిన నిప్పులా ఇరు వర్గాలు శనివారం రాత్రి నూతన సంవత్సరం వేడుకలను గ్రామంలో వేర్వేరుగా చేసుకున్నాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రామంలోని వినాయకుడి గుడి సెంటర్లో మణికంఠ, స్నేహితులు శివాజీ, వేటుకూరి బాబి, అరిగెల ప్రసన్న, వేపుగంటి వినయ్, మండేల బుజ్జిలపై గణేష్ వర్గీయులు ఇనుపరాడ్లు, కర్రలతోదాడి చేసి వారికి చెందిన నాలుగు మోటారు సైకిళ్లను ధ్వంసం చేశారు. గాయాలపాలైన మణికంఠ వర్గీయులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అలాగే టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకట్రావు ఇంటికి వెళ్లి ఆయనకు కుమారుడు మణికంఠపై దాడి చేసి గాయపరిచారు. ఇంటి అద్దాలను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. వెంకట్రావు భార్యను, గర్భిణి అయిన ఆయన కుమార్తెపై కూడా దౌర్జన్యం చేశారు. వెంకట్రావు ఇటీవల గుండె శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ సంఘటనతో ఆయన భయభ్రాంతులకు గురయ్యారు. ఈ కూడలిలో ఉన్న టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. మణికంఠ ఫిర్యాదు మేరకు గణేష్‌తో పాటు కొలిశెట్టి దుర్గాప్రసాద్, రంకిరెడ్డి, పిల్లా బాబి, పొణకలు సురేష్, నక్కా సతీష్, నక్కా రవి, పిల్లా రమేష్, మండేల బాబి, ఆకుల ప్రసాద్, కేశవలపై కేసులు నమోదు చేశారు.