ఆ రహస్యాన్ని ఛేదించలేకపోయిన శాస్త్రవేత్తలు
సాక్షి, కడప : హఠాత్తుగా పడుతున్న గుంతలు వైఎస్ఆర్ జిల్లాలోని పలు గ్రామాల్లో అలజడి రేపుతున్నాయి. వర్షం పడితే ఎక్కడ భూమి కుంగుతుందో తెలియక అక్కడి ప్రజలు వణుకుతున్నారు. ఏదో మాయలా సమీపంలోని భూమి కుంగడం, ఆ గుంతల్లోంచి గాలి వీస్తున్నట్లు శబ్దాలు రావడం స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. రెండేళ్ల క్రితం ఠారెత్తించిన ఇలాంటి గుంతలు ఇప్పుడు మళ్లీ మంగళవారం కనిపించాయి. అప్పట్లో అవి ఎందుకు ఏర్పడ్డాయో ఎవరూ చెప్పలేక పోయారు. రోజుల తరబడి వర్షాలు పడిన ప్రతిసారి బుగ్గవంక ప్రాజెక్టు సమీప గ్రామాల్లో ఇలాంటి గుంతలు ఏర్పడుతున్నాయి.
2015 సంవత్సరం అక్టోబర్లో వర్షాలు బాగా కురవడంతో చింతకొమ్మదిన్నె మండలంలోని అనేకచోట్ల భూమి కుంగిపోయి గుంతలు ఏర్పడ్డాయి. మొదటగా నాయనోరిపల్లెలో ఈ గుంతలు ప్రారంభమయ్యాయి. గ్రామంలోని నీటి ట్యాంకు కూడా కూలిపోయింది. అనంతరం బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయ సమీపంతోపాటు గూడావాండ్లపల్లె, చిన్నము సల్రెడ్డిపల్లె, బుగ్గలపల్లె, నాగిరెడ్డిపల్లె తదితర ప్రాంతాల్లో సుమారు 40 గుంతలు ఏర్పడ్డాయి. అప్పట్లో నాయనోరిపల్లె గ్రామాన్ని ఖాళీ చేయించి ఇందిరానగర్లో ఉన్న ఓ అనాథ శరణాలయంలో గ్రామస్తులకు కొన్ని నెలలపాటు ఆశ్రయం కల్పించారు. వేంపల్లె మండలంలో కూడా గుంతలు పడ్డాయి.
బయటపడని గుంతల రహస్యం
ఈ గుంతల పరిశీలనకు హైదరాబాదుకు చెందిన శాస్త్రవేత్తలు వచ్చినా రహస్యాన్ని పూర్తిగా ఛేదించలేకపోయారు. భూమిలోపల సున్నపు పొర ఉండటంతో వర్షం పడినపుడు గుంతలు ఏర్పడుతున్నాయని చెప్పి వెళ్లిపోయారు. గతంలో ఎప్పడూ లేనిది ఇప్పుడే ఎందుకు ఏర్పడుతున్నాయని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. తర్వాత ఢిల్లీ నుంచి శాస్త్రవేత్తలు వస్తారని అధికారులు చెప్పినా.. వారు రాకపోవడంతో రహస్యం అలాగే ఉండిపోయింది. వర్షం పడగానే మళ్లీ గుంతలు ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయ సమీపంతోపాటు గూడావాండ్లపల్లె సమీపంలోని మామిడితోటలో మంగళవారం రెండు గుంతలు పడ్డాయి. గుంతల రహస్యాన్ని చేధిస్తే గానీ తమలో ఆందోళన తొలగిపోదని స్థానికులు పేర్కొంటున్నారు. బుగ్గవంక ప్రాజెక్టు వల్లే ఇలా అవుతోందేమోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.