టీఆర్ఎస్ మాజీకి బీజేపీ టికెట్?
వరంగల్ ఎంపీ అభ్యర్థిగా చింతా స్వామి పేరు
స్వామి లేదా ఎన్ఆర్ఐ డాక్టర్ దేవయ్యలలో ఒకరికి అవకాశం
సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక బరిలో నిలిచే బీజేపీ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ వ్యవహారం ఆదివారం రాత్రి దాకా కొలిక్కి రాలేదు. ఇప్పటికే ఎన్ఆర్ఐ డాక్టర్ దేవయ్య, మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్, స్థానికంగా ప్రముఖుడైన డాక్టర్ రాజమౌళి పేర్లపై పార్టీలో ఓవైపు చర్చ జరుగుతుండగానే తాజాగా మరో ఇద్దరి పేర్లు తెరపైకి వచ్చాయి. టీఆర్ఎస్లో వివిధ స్థాయిల్లో పనిచేసి గతంలోనే ఆ పార్టీని వీడిన చింతా స్వామి, పోలీసు అధికారి నాగరాజునూ అభ్యర్థిగా ప్రకటించే అంశంపై ఆదివారం పార్టీ నేతల సమావేశంలో చర్చ జరిగింది.
అయితే నాగరాజు ఇంకా సర్వీసులోనే ఉండటంతో ఆయనకు పోటీ చేసేందుకు అనుమతి లభించే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో దేవయ్య లేదా స్వామిలలో ఒకరిని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, అభ్యర్థి ఎంపికపై ఆదివారం రాత్రి ఓ హోటల్లో బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, ఇతర ముఖ్య నేతలు తిరిగి సమావేశమయ్యారు.