చిప్‌కు భయపడి చిల్లర దొంగిలించారు!
దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఓ బ్యాంక్‌ను కొల్లగొట్టి, 12 గంటల్లో పట్టుబడిన దొంగలు.. పోలీసులకు పెద్ద షాకే ఇచ్చారు. కేవలం చిల్లరను మాత్రమే ఎందుకు ఎత్తుకెళ్లారన్న ప్రశ్నకు విస్తుపోయే సమాధానమిచ్చారు. ముఖర్జీ నగర్‌లోని సిండికేట్ బ్యాంకులో ఈ నెల 22న సుమారు రూ.2.3 లక్షల నగదు దోపిడీ జరిగింది. కిటికీ గుండా ప్రవేశించిన ముగ్గురు దుండగులు డబ్బును ఎత్తుకెళ్లిపోయారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే... దొంగలు ఒక్క నోటు కూడా ముట్టుకోలేదు.
46 పాలిథీన్ సంచుల్లో నిల్వ ఉంచిన 5, 10 రూపాయల నాణేలను మాత్రమే తీసుకెళ్లారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో విచారణ ప్రారంభించిన పోలీసులు కేవలం 12 గంటల్లోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. నాణేలను మాత్రమే ఎందుకు దొంగతనం చేశారని అడిగితే... పెద్ద నోట్లను దొంగతనం చేస్తే అందులో ఉన్న చిప్‌ల సాయంతో దొరికిపోతామనే భయంతోనే ముట్టుకోలేదని సమాధానమిచ్చారు. రెండు వేల నోట్లలో ఉన్న చిప్‌ల ద్వారా జీపీఎస్ సాయంతో తాము ఎక్కడున్నా పోలీసులు సులువుగా పట్టేసుకుంటారనే వాటి జోలికి వెళ్లలేదట.