ఇక్కడ గోడలే పాఠ్యపుస్తకాలు
మెదక్: ఉపాధ్యాయుల ప్రోత్సాహం, కృషి ఫలితంగా గోడలే పాఠ్యపుస్తకాలుగా మారి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఓ ఉపాధ్యాయుడు సొంత ఖర్చుతో పాఠశాల గోడలపై వివిధ అంశాలకు సంబంధించిన పాఠ్యాంశాలు ఎప్పుడు విద్యార్థులకు అందుబాటులో ఉండటంతో సౌకర్యంగా మారింది. మండలంలోని చిట్కుల్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు ఎన్టీ భార్గవిప్రసాద్ సొంత ఖర్చుతో హెచ్ఎం నరేందర్రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీనివాసాచారి, దేవేందర్ సహకారంతో పాఠశాలలోని గోడలపై 6వతరగతి నుంచి 10వతరగతి వరకు విద్యార్థులకు ఉపాయోగపడే పాఠ్యాంశాలను రాశారు.
తెలుగు, గణితం, ఆంగ్లం, సాంఘికశాస్త్రం తదితర సబ్జెక్టులకు సంబంధించిన సూత్రాలు, చిట్కాలు, ఆకర్షణీయ సంఖ్యలు, వాటి ప్రక్రియలు, పూర్ణాంకాలు, కారణాంకాలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, భాజనీయత తదితర అంశాలను విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రాశారు. దీంతోపాటు అక్షరాలు గుండ్రంగ రాయడం, ఇంగ్లిషు వర్ణమాల, భారతదేశం నదులు తదితర అంశాలను రాయడంతో విద్యార్థులకు ఇవి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నాయి. దీంతో విద్యార్థులు ఖాళీ సమయంలో సైతం పుస్తకం తెరవకుండానే వాటిని చూస్తు నేర్చుకునే అవకాశం ఉంటుంది.
ఆడుతూ పాడుతూ నేర్చుకునేలా ఉన్నాయి : రాకేష్, 7వ తరగతి
పాఠశాలలో గోడలపై రాసిన వాటిని ఆడుతూ పాడుతూ సులభంగా నేర్చుకునేందుకు ఎంతో ఉపయోగ పడుతున్నాయి.
ఖాళీ సమయంలో ఉపయోగకరంగా ఉన్నాయి: వసంత, 7 తరగతి
పాఠ్య పుస్తకాలు తీయకుండానే గోడలపై ఉన్నవాటిని ఖాళీ సమయంలో నేర్చుకుంటున్నాం. దీంతో సమయం వృధా కాకుండా ఉపయోగంగా ఉంది.
సులభంగా అర్ధమయ్యేందుకే : భార్గవిప్రసాద్ గణితం ఉపాధ్యాయుడు
విద్యార్థులకు గణితం అంటే కొంచం భయం ఉంటుంది. సులభంగా నేర్చుకునేలా గోడలపై గణిత సంబంధమైన సూత్రాలు, గుణాంకలు ఇతర అంశాలను రాశాం. దీంతో అవి ఎప్పకటికీ విద్యార్థులకు అందుబాటులో ఉండటంతో చూస్తు సులభంగా నేర్చుకుంటారు.
ఉపాధ్యాయులు కృషి అభినందనీయం: నరేందర్రెడ్డి, హెచ్ఎం చిట్కుల్
విద్యార్థుల అభివృద్ధి కోసం ఉపాధ్యాయులు ఎంతో శ్రమిస్తున్నారు. దీంతో మంచి ఫలితాలు సాధిస్తున్నాం. పాఠశాల ఉపాధ్యాయుడు సొంత ఖర్చుతో గోడలపై విద్యార్థులకు ఉపయోగ పడే అంశాలు రాయడంతో అవి వారికి అందుబాటులో ఉండి వారి మెదళ్లలో నాటుకు పోతాయి.