సివిల్స్‌లో మెరిశారు
పాలకొల్లు (సెంట్రల్)/అత్తిలి : జిల్లా ఆడపడుచులు సివిల్స్‌లో మెరిశారు. బుధవారం విడుదల చేసిన సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షల ఫలితాల్లో పాలకొల్లుకు చెందిన చోడిశెట్టి మాధవి 104వ ర్యాంకును కైవసం చేసుకోగా, అత్తిలి గ్రామానికి చెందిన మేడపాటి శ్వేత 870వ∙ర్యాంకు సాధించారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మాధవి అరుణ్‌కుమార్, రాజేశ్వరి దంపతుల కుమార్తె. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చేసి అక్కడే సివిల్స్‌కు ప్రిపేరయ్యా రు. మాధవి మాట్లాడుతూ తాను సివిల్స్ రాయడం ఇది రెండోసారి అని.. తనకు లభించిన 104వ ర్యాంకును బట్టి ఐఆర్ఎస్ లభించే అవకాశం ఉందని చెప్పారు. ఐఏఎస్ కావాలనేది తన తాతయ్య గంటా రామచంద్రరావు కోరిక అని, అందుకోసం మళ్లీ పరీక్షలు రాస్తానని తెలిపారు.
తొలి ప్రయత్నంలోనే..
అత్తిలికి చెందిన మేడపాటి శ్వేత తొలి ప్రయత్నంలోనే 870వ ర్యాంకు సాధించారు. 2015లో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ పూర్తి చేసిన ఆమె ఢిల్లీలో కోచింగ్ తీసుకుని 2016లో సివిల్స్ రాశారు. ఆమె తండ్రి మేడపాటి మూర్తి పీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. తల్లి అత్తిలి బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయిని. శ్వేత సోదరి శృతి బీటెక్ పూర్తి చేసి రాజమహేంద్రవరంలోని కొటక్ మహీంద్ర బ్యాంక్‌లో డెప్యూటీ మేనేజర్‌గా పని చేస్తోంది.