చోళ ఎంఎస్‌లో మరో 14% వాటా అమ్మకం
► జపాన్ భాగస్వామ్య సంస్థకు విక్రయించనున్న మురుగప్ప గ్రూప్
► ఒప్పందం విలువ రూ.883 కోట్లు..
చెన్నై: చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో మరో 14 శాతం వాటాను భాగస్వామ్య సంస్థకు విక్రయించేందుకు మురుగప్ప గ్రూపునకు చెందిన ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ డెరైక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం విలువ రూ.882.68 కోట్లుగా కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
జపాన్‌కు చెందిన మిత్సుయ్ సుమిటోమో ఇన్సూరెన్స్(ఎంఎస్ఐ) కంపెనీతో కలిపి చోళ ఎంఎస్ జాయింట్ వెంచర్(జేవీ)ను మురుగప్ప గ్రూప్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం జేవీలో ఎంఎస్ఐకి 26 శాతం వాటా ఉంది. తాజా 14 శాతం కొనుగోలుతో ఇది 40 శాతానికి చేరనుంది. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితిని కేంద్రం 26 శాతం నుంచి 49 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.