కన్నీటి గోస
గుక్కెడు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మైళ్ల దూరం వెళుతున్నారు.. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా, పాలకులు మారినా వీరి రాతమాత్రం మారడంలేదు. కంగ్టి మండలంలోని చౌకాన్‌పల్లి గ్రామ జనాభా 2,500. పంచాయతీ పరిధిలోని రాంసింగ్, మెట్టు, జీర్గి తండాల జనాభా సుమారుగా 1,400 వరకు ఉంటుంది. అంటే చౌకాన్‌పల్లి పంచాయతీ జనాభా 3,900. రోజుకు ఓ మనిషి 5 లీటర్ల చొప్పున వాడినా 20 వేల లీటర్ల నీరు అవసరం. కానీ గ్రామంలో ఉన్న చేదబావులు గానీ, చేతిపంపులు కానీ కనీసం 5 వేల లీటర్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాయి.
పంచాయతీ పరిధిలో ఐదు చేదబావులు...నాలుగు చేతిపంపులున్నా, వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భజలాలు తగ్గి అవన్నీ ఎండిపోయాయి. దీంతో పల్లెజనమంతా బిందె చేత పట్టుకుని మైళ్లకు మైళ్లు పరుగులు తీస్తున్నారు. గొంతు తడిపే గుక్కెడు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పెద్దలంతా పనులకు వెళ్తుంటే, చిన్నారులు మాత్రం ఎడారిలో ఒయాసిస్సును వెత్తుక్కుంటూ బాల్యాన్ని నీటికి అంకితం చేసేస్తున్నారు. శీతాకాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక వే సవిలో వీరి కష్టాలు ఎలా ఉంటాయో ఊహించడానికే కష్టం. పల్లెజనం నీటిగోస గురించి తెలుసుకోవాలంటే సెంటర్ స్ప్రెడ్‌కు వెళ్లండి.
రాజులు మారినా.. రాజ్యాలు మారినా.. వీరి తల రాతలు మాత్రం మారడం లేదు. గుక్కెడు నీటి కోసం ఈ అభాగ్యులు పడుతున్న నరడక యాతన మాటలకందనిది. గొంతు తడవాలంటే.. బిందెలు పట్టుకుని పరుగులు తీయాల్సిందే!. వృద్ధులు.. చిన్నారులనే తేడా లేకుండా ‘పానీ’పట్టు యుద్ధాలు చేయాల్సిందే. చేదబావి వద్దకు వెళ్లి పాతాలంలో ఉన్న గంగను తోవేడుకోవాల్సిందే. ఇదీ .. కంగ్టి మండల పరిధిలోని చౌకాన్‌పల్లి పంచాయియతీ పరిధిలోని ప్రజల దుస్థితి. వీరి కష్టాలను తీర్చేందుకు తెచ్చిన నాబార్డ్ మంజీరా, కౌలాస్ పథకాలు అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో మధ్యలోనే చేతులెత్తేశాయి.
సమస్య శాశ్వత పరిష్కారం కోసం బాబుల్‌గాం ఓపెన్‌హౌస్ నుంచి చౌకాన్‌పల్లి వరకు ఆరు కిలో మీటర్ల మేర పైప్‌లైన్ విస్తరణ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలి. కౌలాస్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఒడ్డునే జాక్ వెల్ నిర్మించి నీళ్లను లిఫ్ట్ చేయాలి. సమీపంలోనే సంప్, పంపింగ్ హౌస్ నిర్మించి నీటిని ఫిల్టర్ చేయాలి. ఇక్కడ నుంచి పైప్‌లైన్ ద్వారా చౌకాన్‌పల్లి సంపులోకి వాటర్‌ట్యాంకు అందించాలి.
కంగ్టి మండల పరిధిలోని చౌకాన్పల్లితో పాటు అనుబంధ గ్రామాలైన రాంసింగ్, మెట్టు, జీర్గితండాల ప్రజలు తాగునీటి కోసం నిత్యం అవస్థలు పడుతున్నారు. ఆయా గ్రామాల్లో 4వేల మంది నివాసం ఉంటున్నారు. వీరందరికీ ఆయా ప్రాంతాల్లో అరకొరగా ఉన్న చేదబావులు, చేతిపంపులే దిక్కయ్యాయి.
అందని నాబార్డ్ మంజీరా నీరు...
గ్రామానికి నాబార్డ్ మంజీరా తాగు నీటి పథకం వచ్చి రెండు దశాబ్దాలు దాటింది. కానీ ఇది ఎన్నడూ ప్రజల దాహాన్ని పూర్తి స్థాయిలో తీర్చలేదు. మనూరు మండలం గూడూర్ మంజీరా నది ఒడ్డున జాక్వెల్ ద్వారా కంగ్టి మండలంలోని 24 గ్రామాలకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తాగు నీరు అందిస్తున్నారు. కంగ్టి వరకు నేరుగా పైప్‌లైన్ ద్వారా సంప్‌హౌస్‌కు నీరందుతుంది. ఇక్కడ నుంచి మోటార్ల ద్వారా చౌకాన్‌పల్లి, బోర్గి, కంగ్టి, ముకుందతండాలకు తాగు నీటి సరఫరా చేస్తున్నారు. కానీ ఒక రోజు వస్తే.. వారం వరకు నీళ్లు రావు.
నేరవేరని కౌలాస్ నాలా...
మండలంలోని చౌకాన్‌పల్లి, బోర్గి గ్రామాలకు శాశ్వత మంచి నీటి సరఫరా అందించాలనే ఉద్దేశంతో 2004-05లో రూ.1కోటి వెచ్చించి కౌలాస్ నాలా నీటి పథకం అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఓపెన్ వెల్ నిర్మాణం, పైప్‌లైన్ విస్తరణకు రూ.50లక్షలు, కరెంటు సరఫరాకు రూ.50 లక్షలు వెచ్చించారు. చౌకాన్‌పల్లికి 6 కిలో మీటర్ల దూరంలో ఉన్న నిజామాబాద్ జిల్లా బాబుల్‌గాం శివారులోని కౌలాస్ నాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వద్ద తొలుత ఓపెన్ వెల్ నిర్మించారు. నీటి సరఫరా పంపింగ్‌కోసం కరెంటు అవసరమని ఆరు కిలో మీటర్ల మేర విద్యుత్ స్తంభాలు పాతి, తీగలు బిగించి కరెంటు సరఫరా చేశారు.
దీనికోసం 63 కేవీ ట్రాన్స్ఫార్మర్ను కూడా ఏర్పాటు చేశారు. బాబుల్‌గాం వాగు సమీపంలోని ఓపెన్ వెల్ నుంచి చౌకాన్‌పల్లి వరకు మొత్తం ఆరు కిలోమీటర్ల దూరం పైప్‌లైన్ వేశారు. ఈ పనులు చేయడానికి ఐదేళ్లు పట్టింది. చౌకాన్‌పల్లి వద్ద ఒక సంప్‌హౌస్ నిర్మించి దీనికి పైప్‌లైన్ కనెక్షన్ ఇచ్చారు. బాబుల్‌గాం నుంచి మార్గ మధ్యలో జీర్గితండా వరకు కొన్ని రోజులు నీళ్లు వచ్చాయి. అక్కడి నుంచి చౌకాన్‌పల్లి సంప్‌హౌస్‌కు మాత్రం నీరందడం లేదు. కాంట్రాక్టర్ తీరు, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి నెలకొందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
పైప్‌లైన్ అస్తవ్యస్తం...
ఓపెన్ వెల్ ద్వారా వేసిన పైప్‌లైన్ అస్తవ్యస్తంగా మారడంతో నీటి పంపింగ్‌కు అంతరాయం కలిగింది. పైప్‌లైన్ విస్తరణ సక్రమంగా లేక లీకేజీలు అధికమయ్యాయి. ఓపెన్ వెల్ మోటార్లకు సరైన కరెంటు ఓల్టేజీ అందక పోవడంతో నీటి సరఫరా జరుగడం లేదు. ఈ పథకాన్ని పటిష్ట పరచాలని మరిన్ని నిధులు వెచ్చించి కౌలాస్ నాలా ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఒడ్డున మరో బావి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. రెండు బావుల ద్వారా నీరందించేందుకు రెండు 10 హెచ్‌పీ మోటార్లతో పంపింగ్ చేసేందుకు అధికారులు తూతూమంత్రంగా ప్రయత్నాలు జరిపారు. దీంతో గత ఐదేళ్ల నుంచి ఈ పథకం ప్రజలకు శాపంగానే మారింది.