ఒంటె నుంచి జలుబు!
బెర్లిన్: మానవుల్లో సాధారణ జలుబుకు కారణమైన వైరస్ ఒంటెల నుంచి వచ్చిందని పరిశోధనల్లో తేలింది. రైనోవైరస్ అనే నాలుగు రకాల ఎండమిక్ కరోనా వైరస్లు(ఒకే ప్రాంతానికి పరిమితమైనవి) జలుబు కలిగిస్తాయి. అయితే వీటి వల్ల మానవులకు ఎలాంటి హానీ లేదని పరిశోధకులు చెబుతున్నారు. జర్మనీలోని యూనివర్సిటీ హాస్పిటల్ ఆఫ్ బాన్ పరిశోధకుడు క్రిస్టియన్ డ్రోస్టెన్ బృందం ఈ వైరస్లలో ఒకటైన హెచ్‌సీవోవీ-229ఈ వైరస్ మూలాలను కనుగొన్నారు. కాగా, ప్రాణాంతకమైన మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వైరస్ కూడా ఒంటెల నుంచే మానవులకు సంక్రమించింది.
వెయ్యికి పైగా ఒంటెలను పరిశీలించగా, హెచ్‌సీవోవీ-229ఈ వైరస్ 6 శాతం కేసుల్లో ఉన్నట్లు తేలింది. గబ్బిలాలు, మానవులు, తదితరాలపై చేసిన పరిశోధనల్లో ఒంటెల నుంచే సాధారణ జలుబు మానవులకు సంక్రమించినట్లు తేలిందని పరిశోధకులు చెప్పారు. అయితే వైరస్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే మానవుల్లో నిరోధక శక్తి పెంపొందిందని పేర్కొన్నారు.