ఢిల్లీలో క్రిస్టియన్ స్కూలుపై దాడి
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని దక్షిణ ప్రాంతంలో క్రిస్టియన్ స్కూలుపై దుండగులు శుక్రవారం ఉదయం దాడి చేశారు. ఇది గమనించిన పోలీసులు అక్కడికి చేరుకునే లోపే దుండగులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని వెంటనే పిల్లలను ఇళ్లకు పంపించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పరిశీలిస్తే.. గుర్తు తెలియని వ్యక్తులు సమూహంగా వచ్చి మొదట సీసీటీవీని ధ్వంసం చేసినట్టు ఫుటేజ్‌లో రికార్డు అయింది. రాజధాని ప్రాంతంలో చర్చిలపై దాడులు జరగటం ఏడాదిలోపే ఇది ఆరోసారి.
ఈ గ్రూపులో ముగ్గురు నుంచి నలుగురు నిందితులు ఉన్నారు. దుండగులు విలువైన సామాన్లు ఏవీ ఎత్తుకుపోలేదు. కేవలం ప్రిన్సిపాల్ గది మాత్రమే ధ్వంసం చేసి రూ. 8 వేలు ఎత్తుకెళ్లినట్టు సమాచారం. ఆధారాల కోసం సీనియర్ పోలీసులు సైతం రంగంలోకి దిగారు. దుండగులపై వసంత్ విహార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని పోలీసులు పేర్కొన్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఈ స్కూల్లోనే చదివారు.