ఘనంగా క్రిస్మస్ వేడుకలు
సాక్షి, ముంబై: ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పర్వదినం కారణంగా ముంబై నగరంలోని చ ర్చిలన్నీ కిటకిట లాడాయి. ఎంతో భక్తిశ్రద్ధలతో క్రైస్తవులు యేసుక్రీస్తు గీతాలను ఆలపించారు. విద్యుద్దీపాల అలంకరణలో చర్చిలు కళకళలాడాయి. అనేకచోట్ల వివిధ రకాల ఆకాశదీపాలతో (కందిళ్లు) అలంకరించారు. నగరంలోని భైకల్లా, కొలాబా, బాంద్రా, మాహీం, అంధేరి తదితర ప్రాంతాల్లోని అతిపురాతనమైన సెయింట్ ఆండ్రూ, మౌంట్ మేరీ, సెయింట్ మైఖేల్, సెయింట్ ఏన్స్, సెయింట్ థామస్ క్యాత్డ్రల్ తదితర అనేక చర్చిలలో అర్ధరాత్రి మిడ్నైట్ మాస్‌తోపాటు ఉదయం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుని ప్రార్థనల్లో పాల్గొన్నారు.
తెలుగు ప్రజలు..
ముంైబె , ఠాణేలతోపాటు, రాష్ట్రంలో నివసించే తెలుగు ప్రజలు కూడా క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యంగా పరెల్‌లోని తెలుగువారి చర్చిగా పేర్కొనే రాథోడ్ మెమోరియల్ మెథడిస్ట్ తెలుగు చర్చితోపాటు కొలాబా, మలాడ్, కుర్లా, అంటాప్‌హిల్, మాటుంగా లేబర్ క్యాంప్, ఠాణే, కళ్యాణ్, ఉల్లాస్‌నగర్ తదితర ప్రాంతాల్లోని తెలుగు బాప్టిస్టు చర్చిలు, ‘చర్చి ఆఫ్ క్రైస్ట్’ తెలుగు ఎమ్ బీ చర్చిలన్నీ కిటకిట లాడాయి. ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అదే విధంగా పలు ప్రాంతాల్లో సామూహిక ప్రార్థనలు కూడా చేశారు.
పుణేలో..
పింప్రి, న్యూస్‌లైన్: పుణేలో క్రైస్తవులు మంగళవారం అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలో ఉన్న చర్చిలను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. 221 ఏళ్ల పురాతనమైన ‘సిటీ చర్చి’ లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నగరంలో సుమారు 80 చర్చిలు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 50కి పైగా ఉన్నాయి.
నానాపేట్, కంటోన్మెంట్, ఘోర్పడి తదితర ప్రాంతాల్లో క్రైస్తవులు అధికంగా ఉన్నారు. ఘోర్పడి లో ప్రత్యేకంగా రెండు తెలుగు చర్చిలు ఉండడం విశేషం. వీటిలో తెలుగులోనే ప్రార్థనలు చేస్తారు. కాగా మంగళవారం అర్ధరాత్రి నుంచే తెలుగు ప్రజలు ఈ చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
తెలుగు, మరాఠీ, తమిళ చ ర్చిల నిర్మాణం..
పింప్రి-చించ్వడ్లో తెలుగు, మరాఠీ, తమిళ చర్చిలు ఉన్నాయి. దేహూరోడ్డు-మామృడిలో ఒక తెలుగు చర్చి, అదేవిధంగా ఘోర్పడిలో రెండు తెలుగు చర్చీలు ఉన్నాయి. నగరంలో క్యాథలిక్, ప్రొటెస్టెంట్ చర్చిలు, అదేవిధంగా ఖడికి, వాన్వాడి పరిసరాలలో ఉన్న చర్చీలు, కసబాపేట్‌లోని బ్రదర్ దేశ్‌పాండే చర్చి, నల్స్టాప్లోని చర్చి అతి పురాతనమైనవిగా పేరుగాంచాయి.
సూరత్‌లో...
సాక్షి, ముంబై: సూరత్ లింబాయత్ ప్రాంతంలోని ‘మహాప్రభునగర్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్’ తెలుగు చర్చిలో తెలుగు వారు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చి పరిసర ప్రాంతాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. ముఖ్య అతిథిగా పాస్టర్ సర్జన్‌రావు, సంఘ ప్రముఖులు హాజరయ్యారు. కాగా శాంతాక్లాజ్ వేషధారణ చర్చి ఆవరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.