అవతార్-2ను మించిన టికెట్ ధరలు.. ఆ సినిమాకు ఎందుకంత క్రేజ్!
హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన చిత్రం ఓపెన్ హైమర్. ఈ చిత్రం జూలై 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. హాలీవుడ్ నటుడు సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కోసం ఇండియాలోనూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని 2005లో కై బర్డ్, మార్టిన్ జె. షెర్విన్ రచించిన అమెరికన్ ప్రోమేథియస్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్ పగ్, జోష్ హార్ట్‌నెట్, కేసీ అఫ్లెక్, రామి మాలెక్, కెన్నెత్ బ్రానాగ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి లుడ్విగ్ గోరాన్సన్ సంగీతమందించారు.
(ఇది చదవండి: స్వీయ దర్శకత్వంలో నచ్చినవాడు.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది! )
అయితే భారత్‌లో ఇప్పటికే టికెట్స్ ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించి ఐమాక్స్‌లో కళ్లు చెదిరే రేట్లకు టికెట్స్ అమ్ముడవుతున్నాయి. ఈ మూవీ మొదటి రోజు షోలకు ఒక్కో టికెట్ ధర రూ.2450 పలుకుతోంది. గతంలో జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ అవతార్-2 సినిమా టికెట్ ధర బెంగళూరులో గరిష్ఠంగా రూ.1700 మాత్రమే పలికింది. అంతటి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న అవతార్‌ను సినిమాను మించి టికెట్ ధరలు ఉండడంతో సినీ ప్రియులు ఆశ్చర్య పోతున్నారు.
మనదేశంలో సాధారణంగా టిక్కెట్ ధరలు నగరాన్ని బట్టి మారుతుంటాయి. తాజాగా ముంబయిలో ఓపెన్ హైమర్ మూవీ టికెట్ ధర రూ.2450 ( ఎలాంటి పన్నులు లేకుండా) ఇప్పటికే అమ్ముడయ్యాయి. ముంబయిలోని పీవీఆర్ ఐకాన్, ఫీనిక్స్ పల్లాడియంలో సాయంత్రం ఏడు, రాత్రి పది గంటల షో కోసం సినిమా రిలీజ్ రోజున టిక్కెట్స్ బుక్ కావడంతో అందరి కళ్లు ఈ సినిమాపైనే ఉన్నాయి.
ఈ భారీ టికెట్ ధరలు చూస్తే ఓపెన్ హైమర్ మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టనున్నట్లు తెలుస్తోంది. గతవారంలో టామ్ క్రూజ్ మూవీ మిషన్: ఇంపాజిబుల్ – డెడ్ రికనింగ్ పార్ట్ వన్ ఇండియాలో మొదటి రోజు రూ.12.50 కోట్లు వసూలు చేసింది. తాజాగా సిలియన్ మర్ఫీ నటించిన ఓపెన్‌హైమర్ ఆ చిత్రాన్ని అధిగమిస్తోందేమో వేచి చూడాల్సిందే.
అసలేంటీ ఓపెన్‌హైమర్?
ఒపెన్‌హైమర్ అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త జె.రాబర్ట్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఆయన మొదటి అణు బాంబును అభివృద్ధి చేసిన భౌతిక శాస్త్రవేత్త. కై బర్డ్, మార్టిన్ జె షెర్విన్ రచించిన రాబర్ట్ జీవిత చరిత్ర అమెరికన్ ప్రోమేథియస్ ఆధారంగా రూపొందించారు. కాగా.. ఇప్పటికే హాలీవుడ్ సమ్మె ప్రభావం ఈ చిత్రంపై ఉండదని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: ఈమెని గుర్తుపట్టారా? మీరనుకునే హీరోయిన్ మాత్రం కాదు!)