దేవుడిచ్చిన గిఫ్ట్!
క్రీస్తు పుట్టినరోజు పండుగ అయిన ‘క్రిస్మస్’ అంటే ఇచ్చే పండుగ... కానుకల రూపంలో ప్రేమను పంచి ఇచ్చే పండుగ. ఆప్యాయతనూ, ఆనందాన్నీ ప్రతి ఒక్కరూ మరొకరితో పంచుకొనే పండుగ. క్రిస్మస్ అనగానే పిల్లలకూ, పెద్దలకూ అందరికీ గుర్తొచ్చేది – శాంటా క్లాజ్. మరో మాటలో ‘ఫాదర్ క్రిస్మస్’. పండుగ కానుకలన్నీ తెచ్చి ఇచ్చే క్రిస్మస్ తాతను ప్రేమించని వారు ఎవరుంటారు!
క్రీస్తుకు మూడు కానుకలు!
క్రిస్మస్కు ఇలా కానుకలు ఇచ్చి, పుచ్చుకొనే సంప్రదాయం వెనుక ఒక కారణం ఉంది. యేసుక్రీస్తుకు ముగ్గురు జ్ఞానులు మూడు కానుకలు ఇచ్చారు. ఆ మూడూ ఏమిటంటే – అగరుధూపం, బంగారం, అత్తరు. యూదుల దైవారాధనలో అగరుధూపం వాడతారు. దాన్ని కానుకగా ఇవ్వడం ద్వారా క్రీస్తును ప్రజలు ఆరాధిస్తారని సూచన. ఇక, బంగారమంటే రాజులకు సంబంధించినది. రెండో కానుకగా దాన్ని ఇవ్వడం ద్వారా క్రీస్తు ‘రాజాధిరాజు’ అని గుర్తుచేయడమన్న మాట! పరిమళ ద్రవ్యమైన అత్తరును దేహత్యాగం చేసిన వారి మీద జల్లడం మామూలుగా అలవాటు. అత్తరును కానుకగా ఇవ్వడమనేది సమస్త ప్రజానీకం కోసం క్రీస్తు దేహత్యాగానికీ, శిలువ మరణానికీ సూచన. క్రీస్తు అందుకున్న ఆ కానుకలకు గుర్తుగా పండుగకు ఇలా కానుకలు ఇచ్చి పుచ్చుకోవడం వచ్చినట్లు పెద్దలు చెబుతారు.
ఆ దేవదేవుడు దాదాపు రెండు వేల సంవత్సరాల పైచిలుకు క్రితం ఈ మానవాళికి ఇచ్చిన అతి పెద్ద కానుక ‘యేసుక్రీస్తు’. నిజం చెప్పాలంటే, ఆ అతి పెద్ద కానుకను పురస్కరించుకొని జరుపుకొనే పండుగే కదా – ‘క్రిస్మస్’. ప్రపంచవ్యాప్తంగా కుటుంబాలు, స్నేహితులు పరస్పరం కానుకలు ఇచ్చుకోవడం ఈ పండుగ ఆచారమైంది. శాంటా క్లాజ్ (ఫాదర్ క్రిస్మస్), సెయింట్ నికోలస్లు ఈ కానుకలు ఇస్తారని నమ్మకం. అయితే, జర్మనీలో ‘క్రైస్ట్కైండ్’ అనీ, స్పెయిన్‌లో ‘వైజ్ మెన్’ (జ్ఞానులు) అనీ, ఇటలీలో పెద్ద వయసు మహిళ ‘బెఫానా’ అనీ పేర్కొంటారు. ఏది ఏమైనా, ప్రపంచమంతా పిల్లలు క్రిస్మస్ తాతను ప్రేమిస్తారు.
క్రిస్మస్ తాత పేరు మీద ఇచ్చే ఈ కానుకలను కూడా నేరుగా చేతికి ఇవ్వరు. వాటిని పిల్లల షూస్‌లో, దుస్తుల్లో – ఇలా రకరకాల స్థలాల్లో ఉంచుతారు. చాలా దేశాల్లో స్నేహితులకూ, కుటుంబాలకూ ఇచ్చే కానుకలను క్రిస్మస్ ట్రీ కింద పెడతారు. బ్రిటన్ లాంటి చోట్ల అయితే, క్రిస్మస్ రోజు పొద్దున్నే కుటుంబమంతా కలసి కానుకలను తెరిచి చూస్తారు.
దేవుడే మనిషిగా అవతరించాడు!
యేసుక్రీస్తు దేవుడు. సాక్షాత్తూ దేవుడే మనిషిగా అవతరించాడు. ఆయన తనను తాను చాలా రూపాల్లో చాలా కాలాల్లో వ్యక్తం చేసుకున్నాడు. ఆ రూపాలనే మనం ఆరాధిస్తాం. మానవ రూపంలో అవతరించినందుకే మనం యేసును ఆరాధిస్తాం. – స్వామి వివేకానంద
అత్యుత్తమ గురువు!
మానవాళికి లభించిన అత్యుత్తమ గురువుల్లో యేసుక్రీస్తు ఒకరు. భగవంతునితో క్రీస్తుకు ఉన్న సామీప్యానికి ఆయన జీవితమే నిదర్శనం. భగవంతుని సంకల్పాన్నీ, శక్తినీ యేసు బహిర్గతం చేసినట్లు వేరెవరూ చేయలేదు. అందుకే నేను ఆయనను దేవుని కుమారునిగా భావిస్తాను. – మహాత్మాగాంధీ
ప్రతి మనిషీ క్రీస్తే!
నేను మనిషిని మనిషిగా విశ్వసిస్తాను. అందుకే నాకు ప్రతి మనిషీ సాక్షాత్తూ యేసుక్రీస్తే.– మదర్ థెరిసా