ఇదేం దుస్థితి..
ప్రొద్దుటూరు క్రైం: ఇప్పటికే అర్ధమాసం దాటింది.. ప్రతి ఒకటో తేదీన జీతాలు తీసుకునే వైద్య విధానపరిషత్ ఉద్యోగులకు జూన్ జీతం ఇంత వరకూ అందలేదు.దీంతో ఆ ఉద్యోగుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. జిల్లా వైద్య విధాన పరిషత్ కింద డీసీహెచ్ఎస్ కార్యాలయంతోపాటు ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి, పులివెందుల, రాజంపేట, రాయచోటి, జమ్మలమడుగు, లక్కిరెడ్డిపల్లెల ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో సుమారు 447 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో 234 మంది రెగ్యులర్ ఉద్యోగులు కాగా 213 మంది ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది పని చేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు రూ.1.20 కోట్లు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ.60 లక్షల మేర ప్రతి నెలా జీతాల రూపంలో చెల్లించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 447 మంది ఉద్యోగులు ఉండగా ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రిలో 213 మంది ఉన్నారు. ఇక్కడ రెగ్యులర్ ఉద్యోగులు 93 మంది ఉండగా ఔట్సోర్సింగ్ కింద 110 మంది పని చేస్తున్నారు.
జీతాలు రాక సిబ్బంది ఆందోళన
ఉద్యోగులందరికీ మే నెలాఖరులో జీతాలు ఇచ్చారు. అయితే జూన్‌కు సంబంధించిన జీతం జూలై 1న రావల్సి ఉంది. అయితే ఇప్పటికే 16 రోజులు గడిచింది. కానీ జీతం డబ్బులు మాత్రం ఇవ్వలేదు. జీతం డబ్బునే నమ్ముకొని ఉన్న ఆఫీసు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. జీతం ఎప్పుడు వస్తుందా అని వారు ఎదురు చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. వీరిలో సుమారు 213 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. జీతం రాకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఎందుకు జీతాలు మంజూరు చేయడం లేదో అర్థంకాక ఉద్యోగులు సతమతమవుతున్నారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ప్రారంభంలోనే ఇలా ఉంటే పోనుపోనూ ఎలాంటి గడ్డుపరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
బడ్జెట్ లేదంటున్నారు
ప్రతి నెల 3, 4 తేదీలలో జీతాలు వచ్చేవి. అయితే రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపులో ఆలస్యమవుతోందని అధికారులు అంటున్నారు. జూన్ జీతం ఇంత వరకు రాలేదు. ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులతో చర్చిస్తాం.
- రామ్మోహన్రావు,
ఏపీ డాక్టర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు
ప్రతి విషయంలోనూ అలసత్వమే
ప్రభుత్వం తమకు జీతాలు ఇవ్వడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోంది. బడ్జెట్ కేటాయింపు జరగలేదనే సాకుతో ఆలస్యం చేస్తున్నారు. రావాలసిన ఏ బిల్లు అడిగినా బడ్జెట్ లేదని చెబుతున్నారు. జూన్ జీతం విడుదల చేయాలి.
- సాయిలీల, నర్సెస్ అసోషియేషన్ తాలూకా ప్రెసిడెంట్
ఆందోళన చేస్తాం
ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి జీతాలు సక్రమంగా రావడం లేదు. జీతం ఆలస్యం అవుతుండటంతో చిరు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులను అడిగితే రెగ్యులర్ ఉద్యోగులైన మాకే దిక్కు లేదు. మీకు అప్పుడే ఎలా వస్తాయని అంటున్నారు.
- రాజు, ఏపీమెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి
జూన్ జీతం వెంటనే ఇవ్వాలి
జూన్ నెలకు సంబంధించి జీతం వెంటనే మంజూరు చేయాలి. పెరిగిన నిత్యావసర వస్తువులతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకుని జీతాలు మంజూరు చేయాలి.
- శివకృష్ణ, ఏపీమెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు