చబ్బీ చార్మ్
చిక్కిన అందానికి ఏ డ్రెస్ వేసినా చక్కగానే ఉంటుంది. కాని కాస్త బొద్దుగా ఉన్న ముద్దుగుమ్మలకే డ్రెస్సింగ్ కేర్ తప్పని సరి. దాచాలంటే దాగని శరీరాకృతిని కాస్ట్యూమ్స్‌తో కవర్ చేసుకోవాలనుకుంటారు. అందుకే అన్ని కోణాల్లో ఆలోచించి డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటారు. మనసుకు నచ్చిన డిజైన్ కనిపించిన మన కు నప్పదని కాదనుకుంటారు. ఇలాంటి వారి కోసం ఫ్యాషన్ ప్రపంచంలో సరికొత్త డిజైన్లు చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుత లైఫ్‌స్టైల్.. అమ్మాయిలను వద్దన్నా బొద్దుగా మార్చేస్తోంది. దీంతో పెళ్లికో.. పేరంటానికో.. వెళ్లాలంటే ఎలాంటి దుస్తులు ధరించాలో తెలియక గజగామినిలు తికమకపడుతున్నారు. బొద్దుగా కాకుండా.. ముద్దుగా చూపించే ఆహార్యాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి అతివల కోసమే ఫ్యాషన్ డిజైనర్లు సరికొత్త ఫార్ములాలను పరిచయం చేస్తున్నారు. అంతేకాదు.. బొద్దుగుమ్మలు ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించాలో.. ఏ ఏ రంగులు సూటవుతాయో.. ఇలా సూచిస్తున్నారు.
ఫికర్ మత్..
మేని ఛాయ బంగారంలా మెరిసిపోతున్న చబ్బీ బేబీలు ముదురు రంగులు వేస్తే బెటర్. లైట్ కలర్స్ అయితే మీ లావుతనాన్ని హైలైట్ చేస్తాయి. కాళ్లు కాస్త లావుగా ఉంటే డార్క్ కలర్ బాటమ్ వేసి లైట్ కలర్ టాప్ వేసుకుంటే సరి. అయితే టాప్స్ మాత్రం నడుం కింది భాగం వరకూ ఉండేలా చూసుకుంటే మంచిది. చేతులు చబ్బీగా ఉంటే మాగ్జిమమ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ లేదా ఫుల్ హ్యాండ్స్ ప్రిఫర్ చేయాలి. మరో విషయం వేసుకునే డ్రెస్‌పైన గాని, కట్టుకునే చీరపైన కాని పెద్దపెద్ద పూలు, పెద్ద డిజైన్ ఉంటే అవి మిమ్మల్ని హైలైట్ చేస్తాయి. చిన్న చిన్న పూలు, చుక్కలు ఉండేవి వేసుకుంటే అవి హైలైట్ అయ్యి మీ ఆకారాన్ని దాచేస్తాయి.
ఫ్యాషన్ మస్త్..
అడ్డగీతల టాప్‌లు, షర్ట్లు, ప్యాంట్లు వేసుకుంటే ఉన్నదానికంటే ఇంకాస్త ఎక్కువ లావుగా కనిపిస్తారు. నిలువు గీతల కాస్ట్యూమ్స్ కాస్త సన్నగా, పొడుగ్గా కనిపించేలా చేస్తాయి. ఫ్యాషన్ లుక్ కోరుకునే ‘మంద’గత్తెలు హిప్స్ కింది వరకూ కవర్ చేసే పొడువాటి షర్ట్, మ్యాచింగ్‌గా క్వాలిటీ స్కిన్నీ లెగ్గిన్ వేసుకుంటే అదిరేటి లుక్ వస్తుంది. టాప్, షర్ట్‌లకు సైడ్ కటింగ్స్ లేకుండా చూసుకోవాలి. ఈ కాస్ట్యూమ్స్ ఏ మాత్రం ట్రాన్స్పరెంట్గా లేకుండా చూసుకోవాలి సుమీ. ఈ డ్రెసింగ్‌కు మార్కెట్లో దొరికే షగ్స్ ్రలేదా పలుచటి ఓవర్ జాకెట్ వేసుకుంటే స్టైలిష్ లుక్ సొంతం చేసుకోవచ్చు. చీరకట్టయితే మోచేతుల వరకూ జాకెట్ ఉంటే ఫ్యాషనబుల్‌గా ఉంటుంది. సాధ్యమైనంత వరకూ స్లీవ్‌లెస్‌లు, మెగా స్లీవ్స్ అవాయిడ్ చేయండి. డ్రెసింగ్తోనే సరిపెట్టకుండా.. కాస్త బిగ్‌సైజ్ ఇయర్ టాప్స్, హ్యాండ్ బ్యాగ్స్ సెలెక్ట్ చేసుకుంటే మరీ మంచిది. అన్నింటికన్నా కాన్ఫిడెంట్ ఉండటం ముఖ్యం.
- శిరీష చల్లపల్లి