చుండూరు కేసులో సుప్రీంకోర్టు స్టే
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చుండూరు కేసులో హైకోర్టు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులో నిందితులకు ఉన్నత న్యాయస్థానం బుధవారం నోటీసులు జారీ చేసింది. గుంటూరు జిల్లా చుండూరులో 1991 ఆగస్టు 6న జరిగిన దళితులను అగ్రవర్ణాలకు చెందిన కొందరు ఊచకోత తోసిన విషయం తెల్సిందే.
దీనిపై చుండూరు కేసులో యావ జ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఇరవై మందిని, ఇతర శిక్షలు అనుభవించిన మరో 36 మందిపై మొత్తం శిక్షలు రద్దు చేస్తూ 2014 ఏప్రిల్ 22వ తేదీన హైకోర్టు తీర్చునిచ్చింది. కాగా ఆ తీర్పును పలువురు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దీంతో హత్య కేసు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం, మృతుల బంధువులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణను జరిపిన సుప్రీంకోర్టు ...దిగువ కోర్టు ఇచ్చిన విచారణపై స్టే విధించటంతో పాటు నిందితులకు నోటీసులు ఇచ్చింది.
కాగా దళితుల ఊచకోత ఘటనపై సుదీర్ఘ విచారణ తరువాత ప్రత్యేక న్యాయమూర్తి అనీస్ 2007, ఆగస్టు 1న తీర్పు వెలువరించారు. నిందితులకు ఉరిశిక్ష విధించే అరుదైన కేసు కాదని పేర్కొంటూ మొత్తం 179 నిందితుల్లో 123 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. 21 మందికి యావజ్జీవం, 35 మందికి ఏడాది జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ తీర్పులోని కొన్ని అంశాలపై సందేహాలు లేవనెత్తుతూ బాధిత కుటుంబాలు హైకోర్టును ఆశ్రయించాయి. శిక్ష పడినవారు తమ శిక్షను రద్దు చేయాలంటూ పిటిషన్ వేశారు. మరోవైపు నిర్దోషులుగా విడుదలైన వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం పిటిషన్లు దాఖలు చేసింది.
(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)