సమష్టి కృషితోనే వేడుకలు విజయవంతం
కర్నూలు(అగ్రికల్చర్): సమష్టి కృషితోనే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఊహించిన దానికంటే ఎక్కువగా విజయవంతం అయ్యాయని.. ముఖ్యమంత్రి కూడా నిర్వహణ పట్ల సంతోషం వ్యక్తం చేశారని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు జిల్లా అభివృద్ధికి ఇచ్చిన హామీలపై నెల రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతామన్నారు.
ఇందు కోసం రోజుకు 20 గంటల పాటు శ్రమిస్తానన్నారు. జిల్లాలో సమర్థులైన అధికారులు ఉన్నారని.. వారి సహకారంతో ముఖ్యమంత్రి హామీలకు ఓ రూపును తీసుకొస్తానన్నారు. కర్నూలు ప్రాంతంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు క్లియరెన్స్ లభించిందన్నారు. ఫ్యాక్టరీకి 189 ఎకరాల భూమి అవసరం కాగా.. నిధుల లేమితో భూసేకరణ నిలిచిపోయిందన్నారు. రూ.12 కోట్లు అవసరమని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారన్నారు.
‘వెంటనే పనులు ప్రారంభించండి.. నిధులు త్వరలోనే ఇస్తా’నని హామీ ఇచ్చారన్నారు. తుంగభద్ర నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకాల పనులు పూర్తయినా విద్యుత్ సమస్యలతో ప్రారంభానికి నోచుకోలేదని సీఎంకు వివరించగా ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారన్నారు. జిల్లాలో ఎలాంటి పరిశ్రమలు స్థాపించవచ్చు.. ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రితో చర్చించగా వాటితో పాటు మరిన్ని వరాలు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. స్వాతంత్య్ర వేడుకల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం మరువలేనిదన్నారు.