ఫెడరర్ ఏడోసారి...
- సిన్సినాటి మాస్టర్స్ టైటిల్ సొంతం
సిన్సినాటి (అమెరికా): గతంలో తనకెంతో కలిసొచ్చిన సిన్సినాటి మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఏడోసారి సొంతం చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో ఫెడరర్ 7-6 (7/1), 6-3తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)పై గెలుపొందాడు. తద్వారా గత నెలలో వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకున్నాడు. సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆండీ ముర్రే (బ్రిటన్)ను ఓడించిన ఫెడరర్... ఈ క్రమంలో తన కెరీర్లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్, రెండో ర్యాంక్ ఆటగాళ్లను ఓడిస్తూ టైటిల్‌ను సాధించాడు.
తాజా విజయంతో సోమవారం విడుదలైన ఏటీపీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఫెడరర్ మళ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఫైనల్లో నెగ్గిన ఫెడరర్‌కు 7,31,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 4 కోట్ల 89 లక్షలు) లభించింది. గతంలో ఫెడరర్ సిన్సినాటి మాస్టర్స్ టైటిల్‌ను 2005, 2007, 2009, 2010, 2012, 2014లలో సాధించాడు. ఒకవేళ జొకోవిచ్ ఈ టైటిల్‌ను నెగ్గి ఉంటే ఏటీపీ మాస్టర్స్ సిరీస్‌లోని తొమ్మిది టోర్నీలనూ సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించేవాడు.