సినీ ప్లానెట్లో గోడ కూలి యువకుడు మృతి
కుత్బుల్లాపూర్(హైదరాబాద్): గోడ కూలడంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కాకినాడ సమీపంలోని చిత్తరోడే గ్రామానికి చెందిన కుమారి భర్త చనిపోవడంతో కుమార్తె, కుమారుడు వీరబాబు తో కలిసి రెండేళ్ల క్రితం కొంపల్లి గ్రామానికి వచ్చి జీవనం సాగిస్తున్నారు.
శుక్రవారం ఉదయం కొంపల్లి సినీ ప్లానెట్లో పాతగోడలను కూల్చివేతకు వెళ్లిన వీరబాబు గోడ పక్కనే పనులు చేస్తుండగా మట్టిగోడలు విరిగి పడ్డాయి. తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికంగా ఉన్న రష్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తాము రాకముందే మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించడంపై మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు పోలీసులు జోక్యం చేసుకుని గొడవ జరగకుండా వారిని స్టేషన్కు తీసుకువెళ్లి సముదాయించారు. కేసు దర్యాప్తులో ఉంది.