cinema collections
-
టాలీవుడ్, బాలీవుడ్ల మధ్య క్లాష్ తప్పదా..
కోవిడ్ వల్ల సినిమా షూటింగ్ షెడ్యూల్స్, రిలీజ్ డేట్స్ అన్నీ తారుమారు అయిపోయాయి. విడుదల కావాల్సిన సినిమాల సంఖ్య అలా పెరిగిపోయింది. దీంతో రిలీజ్ డేట్స్ బుక్ చేసుకోవడం కీలకమైంది. ఎంత ముందు బుక్ చేసుకున్నా క్లాష్ అనివార్యంలా కనిపిస్తోంది. సౌత్‌లో తెరకెక్కుతున్న పలు భారీ సినిమాలన్నింటినీ ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో సౌత్‌లో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా సినిమాలు, హిందీ సినిమాల రిలీజ్ డేట్ విషయంలో క్లాష్ ఏర్పడుతోంది. ఇప్పటి వరకూ ప్రకటించిన చిత్రాల్లో సౌత్ వర్సెస్ నార్త్ క్లాష్ వివరాలు. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న మన సౌత్ సినిమాలకు క్లాష్ వల్ల ఏదైనా మైనస్ ఉంటుందా? థియేటర్స్ విషయంలో ఏదైనా ఇబ్బంది ఏర్పడుతుందా? నార్త్ ఆడియన్స్ కంటెంట్‌కి ప్రాధాన్యత ఇచ్చి ఏ సినిమా బావుంటే అది చూస్తారా? లేక హిందీ సినిమాలకే ఓటు వేస్తారా? క్లాష్ అంటే బిజినెస్‌ని షేర్ చేసుకున్నట్టే. మరి బిజినెస్‌ని షేర్ చేసుకుంటారా? లేక కలిసి కూర్చుని మాట్లాడుకుని, ఒకేసారి కాకుండా డేట్స్‌ని మార్చుకుంటారా చూడాలి. ఆర్ఆర్ఆర్ వర్సెస్ మైదాన్ ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను దసరా స్పెషల్‌గా అక్టోబర్ 13న విడుదల చేసున్నట్టు ఇటీవలే ప్రకటించారు. దసరా వీకెండ్‌కి హిందీలో అజయ్ దేవగణ్ నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘మైదాన్’ కూడా విడుదల కాబోతోంది. బోనీ కపూర్ ఈ సినిమా నిర్మాత. అక్టోబర్ 15న మైదాన్ రిలీజ్. ‘‘కోవిడ్ వల్ల ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మా సినిమా రిలీజ్ డేట్ ఇచ్చిన తర్వాత కూడా ‘ఆర్ఆర్ఆర్’ వాళ్లు రిలీజ్ డేట్ ఇవ్వడం సరైనదిగా అనిపించడంలేదు’ అని బోనీకపూర్ బాలీవుడ్ మీడియాతో పేర్కొన్నారు. విశేషం ఏంటంటే.. ‘ఆర్ఆర్ఆర్’లో అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రాధే శ్యామ్ వర్సెస్ గంగూబాయి ప్రభాస్ పీరియాడికల్ లవ్‌స్టోరీ చిత్రం ‘రాధేశ్యామ్’. పూజా హెగ్డే కథానాయిక. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జూలై 30న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు అదే తేదీకి ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గంగూబాయి కతియావాడి’ని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ‘పద్మావత్’ చిత్రం తర్వాత సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఇందులో వేశ్య పాత్రలో నటించారు ఆలియా. పుష్ప వర్సెస్ అటాక్ అల్లు అర్జున్ తొలి ప్యాన్ ఇండియన్ చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇండిపెండెన్స్ వీక్కి ఆగస్ట్ 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. హిందీ సినిమాల్లో ఇండిపెండెన్స్ వీక్ కూడా కీలకమైనదే. ఈ ఇండిపెండెన్స్ డే వీక్‌కు వస్తున్నట్టు జాన్ అబ్రహామ్ ప్రకటించారు. తన తాజా చిత్రం ‘అటాక్’ని ఆగస్ట్ 13న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. మేజర్ వర్సెస్ షేర్షా ముంబై తాజ్ అటాక్స్‌లో మరణించిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. కథను అందించి, టైటిల్ రోల్ చేశారు అడివి శేష్. శశి కిరణ్ తిక్క దర్శకుడు. ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. అదే రోజున సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన ‘షేర్షా’ రిలీజ్ కానుంది. ఆర్మీ కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా ఈ సినిమాను తీశారు. తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ హిందీలో చేసిన తొలి చిత్రమిది. కరణ్ జోహార్ నిర్మించారు. మేజర్, షేర్షా.. రెండూ బయోగ్రఫీ జానర్ కావడం విశేషం. లైగర్ వర్సెస్ భూత్ పోలీస్ పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. కరణ్ జోహార్, చార్మీ, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదల కానుంది. సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్ హీరోలుగా తెరకెక్కుతున్న హారర్ కామెడీ చిత్రం ‘భూత్ పోలీస్’. ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేటర్స్‌లోకి రానుంది. -
ఖైదీ నంబర్ 150 టికెట్‌పై 92% డిస్కౌంట్!!
కలెక్షన్లలో ఖైదీ నంబర్ 150 గత రికార్డులన్నింటినీ నిజంగానే బద్దలు కొట్టిందా? తొలిరోజు కలెక్షన్స్‌లో బాహుబలి వసూళ్లను అధిగమించిందా? తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో కూడా భారీ వసూళ్లను సాధించిందని, ఈ సినిమా ఒక్క రోజులో 47 కోట్లకు పైగా వసూళ్లు సాధించిపెట్టినట్టు తెలిపారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన బాహుబలి తొలి రోజు 35 కోట్లతో సరిపెట్టుకోగా ఖైదీ నంబర్ 150, ఆ రికార్డ్‌ను దాటి కొత్త చరిత్ర సృష్టించినట్టు కూడా బహిరంగంగా ప్రకటించారు. తొమ్మిదేళ్ల విరామం తర్వాత కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నట్టు అంతటా వార్తలొచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్రల్లోనే కాకుండా అమెరికాలో కలెక్షన్లు రికార్డులు సృష్టిస్తోందని ఆ సినిమా విడుదలైన తర్వాత దర్శకుడు వీవీ వినాయక్ చెప్పారు. భోగి ముందు రోజు, భోగి రోజు సినిమా థియేటర్లలో కలెక్షన్లు తగ్గుతాయని, అయితే అందుకు భిన్నంగా తమ సినిమా భోగి ముందు రోజు తెలంగాణలో 2.50 కోట్ల షేర్ వసూలు చేసిందన్నారు. అలాగే రూ.4.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి రికార్డు సృష్టించిందన్నారు. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో గీతా ఆర్ట్స్ అధినేత, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ ఒక అడుగు ముందుకేసి ఖైదీ నెంబర్ 150 తొలిరోజు కలెక్షన్లు చూసిన తర్వాత చిరంజీవితో 151వ సినిమా తీయాలంటే భయమేస్తోందని కూడా చెప్పారు. తొలిరోజు ఖైదీ నెం. 150 సినిమాకు 47 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందని ఆయన తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో 30 కోట్లు వచ్చిందని, ఓవర్సీస్ కలెక్షన్లు కూడా బాగున్నాయని అన్నారు. (చదవండి- చిరంజీవితో సినిమా అంటే భయమేస్తోంది) ఈ డిస్కౌంట్ల మాటేంటి సారూ.. ఓవర్సీస్లో భారీ కలెక్షన్స్ సాధించినట్టు సినిమావర్గాలు చెబుతుంటే మరోవైపు అమెరికాలో డిస్కౌంట్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాను అమెరికాలోనూ విడుదల చేయగా, దాదాపు అన్ని థియేటర్లలోనూ డిస్కౌంట్ ఆఫర్‌తో టికెట్లను విక్రయించారు. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లోని తెలుగువారు ఫండాంగో వెబ్ సైట్ ద్వారా సినిమా టికెట్లను కొనుగోలు చేస్తుంటారు. అసలు ధర 25 డాలర్లు.. అందులో 23 డాలర్ల డిస్కౌంట్ టెక్సాస్ ఆస్టిన్‌లో ఉంటున్న తెలుగువారు చాలామంది 25 డాలర్లు పెట్టి టికెట్ కొనుగోలు చేయగా, వారికి 23 డాలర్ల డిస్కౌంట్ లభించింది. అంటే సినిమా ఒక టికెట్ కేవలం 2 డాలర్లకే కొనుగోలు చేశారన్నమాట. మరో వ్యక్తి కాలిఫోర్నియాలోని సెంచురీ గ్రేట్ మాల్ అండ్ ఎక్స్ డి థియేటర్లో సినిమా కోసం టికెట్ బుక్ చేయగా డిస్కౌంట్ పోను 2 డాలర్లకే టికెట్ లభించింది. సినిమా అమెరికాలో విడుదలకు ముందు కొనుగోలు చేసిన టికెట్లపై ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వలేదని, విడుదల అయిన తర్వాతే ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ చేశారని అక్కడి వారు చెబుతున్నారు. పలువురు ప్రవాసులు తమ డిస్కౌంట్ టికెట్లను సోషల్ మీడియాల్లో పోస్టు చేశారు. ఈ డిస్కౌంట్ల మహిమేమో... ఓవర్సీస్ కలెక్షన్ల గురించి సరైన లెక్కలు చెప్పడం లేదన్న మాట వినిపిస్తోంది. కొసమెరుపు అమెరికాలో ప్రతి మంగళవారం ఇలాంటి ఆఫర్లు సర్వసాధారణమేనని అవి ఏ సినిమాకైనా ఆఫర్లు ప్రకటిస్తారని సాక్షి రీడర్స్ తెలియజేశారు. ఇది ఒక్క ఖైదీ నంబర్.150కే పరిమితం కాదని అలాగే తెలుగు సినిమాలు అమెరికాలో విడుదలైనప్పుడు దాదాపు అన్ని సినిమాలకు ఇదే తరహాలో ఆఫర్లు అందుబాటులో ఉంటాయని 'సాక్షి'ని అభిమానించే అశేషమైన పాఠకులు తెలిపారు. -
'మనం' ముందు నిలబడలేకపోయిన 'విక్రమసింహ'
చెన్నై: రజనీకాంత్ సినిమా 'విక్రమసింహ' తెలుగు బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన 'మనం' సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాతో పాటు విడుదలైన 'విక్రమసింహ' ప్రేక్షకుల ఆదరణ కరువై కాసులు కురిపించలేకపోతోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు బాగానే ఉన్నట్టు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆరు భాషల్లో విడుదలైన ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ. 42 కోట్లు సాధించింది. త్రీడీ మోషన్ కాప్చరింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించినంత స్పందన రావడం లేదు. ఓపెనింగ్ వీకెండ్ లో మనం సినిమా ఆంధ్రప్రదేశ్ లో రూ.5.32 కోట్ల వసూళ్లు రాబట్టగా, విక్రమసింహ రూ. 2.8 కోట్లకు పరిమితమైంది. మనం సినిమా బాగుందన్న టాక్ రావడంతో వసూళ్లు పెరుగుతున్నాయి.