సింగిరెడ్డికి దక్కిన పదవి
వనపర్తి: మలిదశ తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన వనపర్తి పట్టణానికి చెందిన టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తింపునిచ్చారు. ఆయనకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవిని కట్టబెడుతూ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నిరంజన్‌రెడ్డి అనుచరుల్లో ఆనందం వెల్లివిరిసింది. వనపర్తిలో వారు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు.
నిరంజన్‌రెడ్డి ప్రస్థానం ఇలా..
పానగల్‌కు చెందిన సాధారణ రైతు రామిరెడ్డి. సారకమ్మ దంపతుల ఏకైక సంతానం నిరంజన్‌రెడ్డి. ఆయన 1958లో అక్టోబర్ 4వ తేదీన జన్మించారు. చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న నిరంజన్‌రెడ్డి ప్రాథమిక విద్యను పానగల్ మండల కేంద్రంలో, హైస్కూల్ విద్యను వనపర్తిలో అభ్యసించారు. మెరిట్ స్కాలర్షిప్ అందుకున్న తొలి విద్యార్థిగా, విద్యార్థి సంఘం నాయకుడిగా గుర్తింపు పొందారు.
ఉస్మానియా యూనివర్సీటిలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన మహారాష్ట్రలోని అహ్మదాబాద్ యూనివర్సీటి నుంచి లా పట్టా పొందారు. వనపర్తి బార్ అసోసియేషన్‌లో న్యాయవాద వృత్తిని ప్రారంభించి ఎన్నో సంచలన కేసులకు న్యాయవాదిగా వ్యవహరించారు. 1980లో తెలుగుదేశం పార్టీలో చేరి 2000 సంవత్సరంలో ఏపీ ముఖ్యమంత్రి అంతరంగిక ముఖ్య సలహాదారుల్లో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్‌గా కూడా పనిచేశారు. తర్వాత కాలంలో తెలంగాణ సాధనే లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్లో చేరి వ్యవస్థాప ఉద్యమనేతగా గుర్తింపు గడించారు.
ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడిన నిరంజన్‌రెడ్డి తెలంగాణ ఏర్పాటు కోసం యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీకి టీఆర్ఎస్ ఇచ్చిన నివేదికలో నిరంజన్‌రెడ్డి ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను వివరించారు. పాలమూరు జిల్లాలో తెలంగాణ ఉద్యమానికి ఉరకలు నేర్పించి ఉద్యమం ప్రభావం లేదనుకున్న చోటే కేసీఆర్‌ను కీలక దశలో పాలమూరు ఎంపీగా గెలించడంలో నిరంజన్‌రెడ్డి ప్రధాన భూమిక పోషించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నుంచి టీఆర్ఎస్ తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నిరంజన్‌రెడ్డి స్వల్ప ఓట్లతో పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి తమ నేతకు ఉద్యమనాయకుడిగా ఏదో ఒక కీలక పదవి లభిస్తుందని అభిమానులు, పార్టీ శ్రేణులు ఆశలు పెట్టుకున్నారు. అం దుకు తగ్గట్టుగానే తెలంగాణ రాష్ట్ర తొలి ప్రణాళిక సం ఘం ఉపాధ్యక్ష పదవిని ముఖ్యమంత్రి అప్పగించడం తో వనపర్తిలో హర్షతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
బంగారు తెలంగాణకు బాటలు వేస్తా : నిరంజన్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్ష బాధ్యతలను చేపట్టి పాలమూరు జిల్లాను ప్రగతిపథంలోకి తేవడంతో పాటు పది జిల్లాల బంగారు తెలంగాణకు బాటలు వేస్తానన్ని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎస్.నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్ష అప్పగించేందుకు నిర్ణయించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి అన్నివర్గాలను ఒకటి చేశామని.. తనకు సహకరించిన వారినీ ఎన్నడూ మరువబోనన్నారు. ప్రణాళిక సంఘం ద్వారా వచ్చే నిధులన్నీంటిని కిందస్థాయి పేద ప్రజల దరికి చేరేలా పథకాలను రూపొందిస్తామన్నారు.