కూచిపూడికి కంఠాభరణం
ఆయన చిరునామా కూచిపూడి... అది ఒకప్పడు!
ఇప్పుడు కూచిపూడికి ఆయనే ఓ చిరునామా!
కొన్ని దశాబ్దాలపాటు కూచిపూడి నాట్యానికి సేవ చేశారు తాజాగా 94 ఏళ్ల వయసులో... కేంద్రసంగీత నాటక అకాడెమీ అవార్డును అందుకున్నారు
‘‘ఈ పురస్కారాన్ని అందుకున్న చేతులు మాత్రమే నావి...
అసలైన పురస్కార గ్రహీత కూచిపూడినాట్యమే’‘ అంటున్నారు...
అవార్డు గ్రహీత చింతా సీతారామాంజనేయులు
చింతా సీతారామాంజనేయులు పుట్టిపెరిగింది కృష్ణాజిల్లా కూచిపూడి గ్రామంలో. తండ్రి నుంచి నాట్యాన్ని వారసత్వంగా అందుకున్నారు. జీవితంలో కూడా ఆ నాట్యం నడిపించినట్లే అడుగులు కదిపారు. కూచిపూడి నాట్యపరిమళాలను అనేక ప్రాంతాలకు విస్తరించే క్రమంలో కూచిపూడి కళాక్షేత్ర కొత్తగా ఏర్పాటు చేసిన శాఖ కోసం నాట్యాచార్యునిగా గుడివాడలో అడుగుపెట్టారు.
రక్తం పంచుకు పుట్టిన ఐదుగురికీ నాట్యం నేర్పించారు. ‘‘కూచిపూడి నాట్యంలో మాది నాలుగవ తరం. నాకిప్పుడు 94 ఏళ్లు. ఆరవ ఏట గజ్జె కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాట్యమే ఊపిరిగా జీవిస్తున్నా’’ అన్నారు సీతారామాంజనేయులు. ప్రతిష్ఠాత్మక కేంద్ర సంగీత నాటక అకాడెమీ అవార్డును గత వారమే అందుకున్న ఆయనను కదిలిస్తే, కూచిపూడి సంప్రదాయానికి సంబంధించి తన జ్ఞాపకాలను పంచుకున్నారాయన.
‘‘ఇప్పుడు ఉన్నటువంటి సౌకర్యాలు అప్పట్లో ఉంటే కూచిపూడి నాట్యం ఎప్పుడో ఖండాంతర ఖ్యాతిని సాధించేది. మేము ఒక ఊరి నుంచి మరో ఊరికి బళ్లు కట్టుకుని వెళ్లేవాళ్లం. ఐదారు మైళ్ల దూరాలు నడిచి వెళ్లేవాళ్లం. అప్పట్లో నాట్యసాధన అంటే అదే ప్రధాన వ్యాపకం అన్నట్లు ఉండేది. నాట్యం, అభినయం, కీర్తనం (సాహిత్యం), హావభావాలు పలికించడం... ఈ నాలుగింటినీ సమన్వయం చేస్తూ సాధన చేయాలి. అందులో పరిణతి చెందాలి. అప్పుడే కళాకారుడిగా గుర్తించేవారు.
అప్పట్లో గురువులు నాట్యసాధన కోసం పెద్దగా సౌకర్యాలను కోరేవాళ్లు కాదు. ఇళ్లలో, గుళ్లలో, సత్రాల్లో ఎప్పుడు ఎక్కడ సాధ్యమైతే అక్కడే సాధన చేయించేవారు. ఉన్నట్లుండి ఒకసారి వీధిలోకి తీసుకెళ్లి సాధన చేయమనేవారు. పిల్లల్లో సిగ్గు, బిడియం వదలడానికి అలా చేసేవారన్నమాట. హఠాత్తుగా ఎవరైనా రాలేకపోతే ఆ పాత్రను మరొకరు రక్తి కట్టించేవారు తప్ప తెల్లముఖం వేయడమనేదే లేదు.
మా గురువులు మమ్మల్ని అలా తీర్చిదిద్దారు. అప్పట్లో ‘శశిరేఖా పరిణయం, ఉషాపరిణయం, భక్త ప్రహ్లాద’ యక్షగానాల్లో శశిరేఖ, ఉష, లీలావతి పాత్రలు వేసేవాణ్ణి. ఆడ, మగ - ఏ పాత్రలోనైనా భావాలు పలికించడంలో ఎటువంటి ఇబ్బందీ ఉండేది కాదు. తరువాతి రోజుల్లో యక్షగాన ప్రక్రియలో ఎక్కువ ప్రయోగాలు చేశా. యక్షగానంలో ఎవరి పాట వారే పాడాలి, ఎవరి సంభా షణలు వాళ్లే చెప్పాలి. ఒక కథాంశాన్ని ప్రదర్శించాలంటే కనీసం ఏడాది సాధన చేయాలి. చెరుకూరి వీరయ్య (స్క్రిప్టు) సహకారంతో సమకాలీన అంశాలను యక్షగానాలుగా ప్రదర్శించాను.
గుడివాడలో పనిచేశాక, జవహర్ బాలభవన్ నాట్య కార్యక్రమాల రూపకల్పన కోసం నాగార్జున సాగర్లో సేవలందించా. వందల మందికి కూచి పూడి శిక్షణనిచ్చా. 1947లో స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా న్యూఢిల్లీలో ‘ఉషాపరిణయం’ప్రదర్శన ఇచ్చాం. మరో సందర్భంలో రాధాకృష్ణ నాటకంలో రాధ పాత్ర పోషించినప్పుడు మా గురువు వేదాంతం పార్వతీశం గారు మెచ్చుకున్నారు. ఇవి రెండూ మరచిపోలేని సంఘటనలు’’ అంటారాయన.
రాష్ర్టపతి నుంచి అందుకున్న తాజా అవార్డును ప్రస్తావించినప్పుడు...‘‘ఇది నాకు వచ్చిన పురస్కారం కాదు. మా కూచిపూడికి అందిన గౌరవం. మా గురువు గారికి చెందాలి. ఆ రోజుల్లో ఎవరూ గుర్తించకపోవడంతో వారికి ఇలాంటి పురస్కారాలు రాలేదు. ఇప్పుడు గుర్తించే మాధ్యమాలున్నాయి కాబట్టి ఈ కళలో ఉన్న గొప్పతనాన్ని దేశం గుర్తించింది. కానీ, ఇవాళ్టికీ జీవితాంతం కళ కోసమే జీవించిన ఎందరో జీవనభృతి లేక ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వం కొంత నిధిని ఏర్పాటు చేసి వారికి నెలనెలా కొంత భృతి కల్పిస్తే బావుండని నా ఆశ. ఒక గుర్తింపు కార్డు ఇస్తే అదే పురస్కారాల పెట్టు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లాగా డాన్సు, మ్యూజిక్ కూడా పెడితే... మన సంప్రదాయ నాట్యరీతి, సంగీతం పట్ల ప్రాథమిక అవగాహన కలుగుతుంది. నా వంతుగా ఇప్పటికీ ఇంటి దగ్గర చిన్నపిల్లలకు నాట్యం నేర్పిస్తున్నా’’ అన్నారాయన.
ఒకే ఒక్క బ్యాలే రూపొందించి తగినంత గుర్తింపు రాలేదని ఆవేదన చెందేవాళ్లు ఎక్కువవుతున్న ఈ రోజుల్లో ఇన్ని దశాబ్దాలు కృషి చేసినా, ‘ఈ పురస్కారం అందాల్సింది నాక్కాదు, కూచిపూడి నాట్యానికి’ అంటున్న సీతారామాంజనేయులు గారిని చూస్తే ఎంత ఎదిగినా... ఒదిగి ఉండాలన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తారు.
- వాకా మంజులారెడ్డి