తమిళనాడులో భద్రతాదళ కాల్పులు: కార్మికుడి మృతి
కడలూరు(తమిళనాడు) పిటిఐ: చెన్నై: కడలూరు జిల్లాలో నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్సి) వద్ద భద్రతాదళాలు జరిపిన కాల్పులలో ఒక కార్మికుడు మృతి చెందాడు. ఈ విషయం తెలిసి పెద్ద సంఖ్యలో ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
నైవేలి ఎస్ఐ రామనాథన్ చెప్పిన ప్రకారం సురేష్ అనే కార్మికుడు, అతని సహచరుడు ఈ రోజు మధ్యాహ్నం అనుమతిలేకుండా ఎన్ఎల్సి రెండవ గనిలోకి వెళ్లడానికి ప్రయత్నించగా, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సిఐఎస్ఎఫ్) కానిస్టేబుల్ రామ్‌సింగ్ అడ్డుకున్నాడు. మొదటి గనిలో పనిచేస్తున్నవారికి రెండవ గనిలోకి ప్రవేశించడానికి అనుమతిలేదు. మద్యం సేవించి ఉన్న వారు కానిస్టేబుల్‌తో గొడవపడి, ఘర్షణకు దిగారు. దాంతో కానిస్టేబుల్ జరిపిన మూడు రౌండ్ల కాల్పులలో సురేష్ (31) అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో వచ్చిన వ్యక్తి తప్పించుకున్నాడు. విషయం తెలిసి సురేష్ గ్రామస్తులు సంఘటనా స్థలానికి తరలి వచ్చారు. పరిస్థితిని అదుపులో ఉంచడానికి జిల్లా ఎస్పి రాధిక పోలీస్ దళాలను రెండవ గని వద్దకు తరలించారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అదుపులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.