కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వాలు
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గఫూర్
నెల్లూరు(సెంట్రల్):
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గఫూర్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం జరిగిన యునైటెడ్ ఎలక్ట్రసిటీ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా సదస్సులో ఆయన మాట్లాడుతూ కార్మికులు కష్ట పడి సాధించుకున్న చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవరణ చేస్తూ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం గళమెత్తినా కార్మికులపై ఉక్కుపాదం మోపుతున్నాయన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబరు 2 న నిర్వహించనున్న దేశ వ్యాప్తం సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో యూఐఐయూ రాష్ట్ర అధ్యక్షుడు దుగ్గిరాల సూరిబాబు, నాయకులు సుధాకర్‌రావు, జాకీర్, ఖాజావలి, రామయ్య పాల్గొన్నారు.