ఆక్వా కార్మికుల బైక్ ర్యాలీ
భీమవరం : భీమవరం పరిసర ప్రాంతాల్లో రొయ్యలు, చేపలు, అనుబంధ పరిశ్రమల ద్వారా రాష్ట్రానికి డాలర్ల వర్షం కురిపిస్తున్నా ఆక్వా రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఏ మాత్రం గుర్తింపునివ్వడం లేదని సీఐటీయూ నాయకుడు జేఎన్వీ గోపాలన్ ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 2న చేపట్టిన సమ్మెలో కార్మికులంతా ఐక్యంగా పాల్గొనాలని కోరుతూ శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమవరం పరిసర ప్రాంతాల్లో వరిసాగు గణనీయంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఆక్వా సాగుపైనే ఆధారపడి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఐస్ ఫ్యాక్టరీలు, మేతల పరిశ్రమలు, రొయ్యల పరిశ్రమల్లో దాదాపు 25 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. ఆక్వా పరిశ్రమల వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బీవీ వర్మ మాట్లాడుతూ ఆక్వా పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు ఎటువంటి కార్మిక చట్టాలు అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.