మనీ, మందుకు చెక్..!
గుర్గావ్: ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రధానంగా ఉపయోగించే డబ్బు, మందుకు చెక్ పెట్టేందుకు ఢిల్లీ, గుర్గావ్ పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. హర్యానా నుంచి నగరంలోకి అక్రమంగా మందు, డబ్బు రవాణా కాకుండా సరిహద్దుల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. ఢిల్లీ, గుర్గావ్ పోలీసు ఉన్నాధికారులు ఇటీవల ఈ విషయమై సమావేశమయ్యారని, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
గూండాలకూ అడ్డుకట్ట...
ప్రలోభాలకు లొంగనివారిని భయపెట్టడం కొత్త ట్రెండ్‌గా మారిన ఈ రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేతలు గూండాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ పనికి ఎక్కువగా పహిల్వాన్లను ఉపయోగించుకుంటున్నారు. వ్యక్తిగత భద్రత పేరుచెప్పి వీరిని రంగంలోకి దించుతూ ప్రత్యర్థులను భయపెట్టేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఈ పహిల్వాన్లను హర్యానాలోని అఖాడాలు ఎక్కువగా సరఫరా చేస్తుంటాయి. ఇటువంటి అఖాడాలు గుర్గావ్, ఢిల్లీల్లో లేకపోవడంతో హర్యానా నుంచే తె ప్పించుకోవాల్సి వస్తోంది. ఈ విషయంపై కూడా దృష్టిసారించిన పోలీసులు గూండాలు, పహిల్వాన్ల రాకపై కూడా ఆంక్షలు విధిస్తున్నారు.
ట్రాఫిక్‌కు అంతరాయం...
నగర సరిహద్దుల వద్ద పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీలతో ట్రాఫిక్‌కు భారీగా అంతరాయం కలుగుతోంది. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. అనుమానం వచ్చిన వాహనాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బారీకేడ్ల మార్గంలోకి పంపుతూ మిగతా వాహనాలను యథావిధిగా పంపుతున్నారు. తాము తీసుకుంటున్న భద్రతా చర్యలవల్ల ప్రయాణికులకు కొంత ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవమేనని, అయితే ఎన్నికల వరకు ఈ అవస్థలు పడక తప్పదని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ప్రశాంతతే మా లక్ష్యం..
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలన్నదే తమ లక్ష్యమని నోయిడా కమిషనర్ అలోక్ మిట్టల్ తెలిపారు. అందుకే ఢిల్లీ నగరంలోకి ఎటువంటి మద్యం, నగదు, ఆయుధాలు సరఫరా కాకుండా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాకుండా అసాంఘిక శక్తుల రాకను కూడా అడ్డుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు అనుమానిత వ్యక్తులుగానీ, మందు, నగదు పట్టుబడలేదని చెప్పారు. రాత్రి సమయాల్లో గుర్గావ్ ఎక్సైజ్ విభాగం కూడా ఈ తనిఖీల్లో పాల్గొంటోందన్నారు.