తెలుగు బిలియనీర్లు ఏడుగురు!
♦ దేశంలోనే ధనిక నగరంగా ముంబై
♦ బిలియనీర్లూ అక్కడే అధికం
♦ ఆ తరువాత ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్
♦ వర్ధమాన నగరాల్లో విశాఖ న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక
తెలుగు రాష్ట్రాల్లో ఐదు బడా లిస్టెడ్ కంపెనీలు వాటి యజమానుల్ని బిలియనీర్ల జాబితాలో నిలబెట్టాయి. అరబిందో ఫార్మా, అమరరాజా బ్యాటరీస్, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, దివీస్ ల్యాబ్స్... ఈ కంపెనీల యజమానులు బిలియనీర్ల జాబితాలో నిలబడ్డారు. దేశంలో ఏఏ నగరాలు ధనికమైనవో, ఎక్కడెక్కడ ఎంతమంది బిలియనీర్లున్నారో తెలియజేస్తూ... ‘న్యూ వరల్డ్ వెల్త్’ తాజా నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో హైదరాబాద్‌లో ఏడుగురు బిలియనీర్లు ఉన్నట్లు పేర్కొంది. కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల వ్యక్తుల్ని హైదరాబాద్‌కు చెందినవారిగానే భావిస్తుండటంతో ఈ మేరకు పేర్కొని ఉండొచ్చని తెలుస్తోంది.
ఈ ఐదు లిస్టెడ్ కంపెనీలతో పాటు అన్‌లిస్టెడ్ గ్రూపులైనప్పటికీ వివిధ వ్యాపారాల్లో విస్తరించిన రామోజీ గ్రూపు అధిపతి రామోజీరావు, నవయుగ గ్రూపు సంస్థల అధిపతి సి.విశ్వేశ్వరరావు ఈ జాబితాలోని మిగతా ఇద్దరూ అయి ఉండే అవకాశముంది. ఆయా నగరాల్లోని మొత్తం వ్యక్తుల అప్పుల్ని మినహాయించి, వివిధ కంపెనీల్లో వాటాలు, ఇతర ప్రైవేటు ఆస్తుల్ని కలిపి ఈ లెక్క వేసినట్లు నివేదిక వివరించింది.
జాబితాలో కనీసం రూ.6.5 కోట్ల (1 మిలియన్ డాలర్లు) విలువగల నికర ఆస్తులను కలిగిన వారిని మిలియనీర్లుగా, రూ.6,500 కోట్ల (1 బిలియన్ డాలర్లు) విలువైన నికర ఆస్తులను కలిగిన వారిని బిలియనీర్లుగా పేర్కొన్నారు. మొత్తంగా ఈ ఏడాది జూన్ నాటికి దేశంలో రూ.364 లక్షల కోట్ల (5.6 ట్రిలియన్ డాలర్లు) సంపద, 2,64,000 మంది మిలియనీర్లు, 95 మంది బిలియనీర్లు ఉన్నారు.
ఈ జాబితా ప్రకారం... దేశంలోని సంపన్న నగరాల విషయానికొస్తే ఆర్థిక రాజధాని ముంబై... ‘ధనిక నగరం’ బిరుదునూ సొంతం చేసుకుంది. 45,000 మంది మిలియనీర్లు, 28 మంది బిలియనీర్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ నగరంలోని మొత్తం సంపద విలువ దాదాపు రూ.53.3 లక్షల కోట్లుగా (820 బిలియన్ డాలర్లు) ఉన్నట్లు న్యూ వరల్డ్ వెల్త్ తన నివేదికలో వెల్లడించింది. ముంబై తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నిలిచాయి. ఢిల్లీలో 22,000 మంది మిలియనీర్లు, 18 మంది బిలియనీర్లు ఉండగా... ఈ నగరంలోని మొత్తం సంపద విలువ దాదాపు రూ.29.2 లక్షల కోట్లు (450 బిలియన్ డాలర్లు). మూడో స్థానంలో నిలిచిన బెంగళూరులో 7,500 మంది మిలియనీర్లు, 8 మంది బిలియనీర్లు ఉన్నారు. ఈ నగరంలోని మొత్తం సంపద దాదాపు రూ.20.8 లక్షల కోట్లుగా (320 బిలియన్ డాలర్లు) ఉంది.
హైదరాబాద్ సంపద 20 లక్షల కోట్లు
దేశంలో 4వ సంపన్న నగరంగా నిలిచిన హైదరాబాద్‌లో 8,200 మంది మిలియనీర్లు, ఏడుగురు బిలియనీర్లు ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఈ నగర మొత్తం సంపద దాదాపు రూ.20.1 లక్షల కోట్లుగా (310 బిలియన్ డాలర్లు) ఉంది. ఏడుగురు బిలియనీర్ల పేర్లను సంస్థ వెల్లడించకపోయినప్పటికీ.. ఆయా వ్యక్తులకు సంబంధించిన లిస్టెడ్ కంపెనీల్లో వారి కుటుంబీకులకు ఉన్న షేర్లు, వాటి ప్రస్తుత ధర ఆధారంగా చూస్తే..
• అరబిందో ఫార్మాలో ప్రమోటర్లు నిత్యానందరెడ్డి, రామ్‌ప్రసాద్‌రెడ్డి కుటుంబీకులకు 47.74 శాతం వాటా ఉంది. దీని మార్కెట్ విలువ దాదాపు రూ.24,255 కోట్లు.
• అమరరాజా బ్యాటరీస్‌లో ప్రమోటర్లు గల్లా రామచంద్రనాయుడి కుటుంబానికి, ఆయనకు చెందిన కంపెనీలకు 52 శాతం వాటా ఉంది. దీని మార్కెట్ విలువ దాదాపు రూ.9.139 కోట్లు.
• దివీస్ ల్యాబ్స్‌లో మురళి దివి కుటుంబానికి 49% వాటా ఉంది. దీని మార్కెట్ విలువ దాదాపు రూ.17,092 కోట్లుగా ఉంది.
• డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌లో దివంగత అంజిరెడ్డి కుటుంబీకులకు 30.73% వాటా ఉంది. దీని విలువ రూ.16,860 కోట్లు.
• చెన్నై కేంద్రంగా నడుస్తున్నప్పటికీ రాష్ట్రానికి చెందిన డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి కుటుంబం ప్రమోటర్లుగా ఉన్న అపోలో హాస్పిటల్స్‌లో ఈ కుటుంబానికి 34% వాటా ఉంది. దీని విలువ రూ.6,500 కోట్లుపైనే.
• మిగిలిన ఇద్దరు బిలియనీర్లూ అన్‌లిస్టెడ్ గ్రూపులకు చెందినవారే. మార్కెట్ విలువ బిలియన్ డాలర్లకన్నా చాలా ఎక్కువ ఉండొచ్చని భావిస్తున్న రామోజీ గ్రూపులో రామోజీ ఫిల్మ్‌సిటీ, ఈనాడు, ఈటీవీ, కళాంజలి, మార్గదర్శి చిట్‌ఫండ్స్, మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్, డాల్ఫిన్ హోటల్స్, ఉషాకిర ణ్ మూవీస్ వంటివి ఉన్నాయి.
• రాష్ట్రానికి చెందిన నవయుగ గ్రూపు సైతం కృష్ణపట్నం పోర్టుతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, ఎక్స్‌పోర్ట్స్, స్టీల్, ఇన్ఫోటెక్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ఉంది.
వర్ధమాన నగరాల్లో విశాఖ..
హైదరాబాద్ తర్వాతి స్థానంలో 8,600 మంది మిలియనీర్లు, 10 మంది బిలియనీర్లతో కోల్‌కతా నిలవగా... 3,900 మంది మిలియనీర్లు, ఐదుగురు బిలియనీర్లతో పుణే ఆ తరవాత నిలిచింది. చెన్నైలో 6,200 మంది మిలియనీర్లు, నలుగురు బిలియనీర్లు ఉండగా... గుర్గావ్లో 3,600 మంది మిలియనీర్లు, ఇద్దరు బిలియనీర్లు ఉన్నారు. వర్ధమాన నగరాల జాబితాలో విశాఖపట్నం స్థానం పొందింది. విశాఖతోపాటు సూరత్, అహ్మదాబాద్, గోవా, చండీగఢ్, జైపూర్, వడోదర ఈ జాబితాలో ఉన్నాయి. మున్ముందు సంపద సృష్టి ప్రధానంగా హైదరాబాద్, పుణే, బెంగళూరు వంటి నగరాల్లో జరుగుతుందని నివేదిక పేర్కొంది.