10కే రన్
3.. 2.. 1.. గో..! గుంపులో తడబడుతూ పడే అడుగులు.. ఆపై త్వరపడతాయి. పది కిలోమీటర్ల దూరంలోని లక్ష్యం వైపు దూసుకెళ్తాయి. ఏటా భాగ్యనగరాన్ని పలకరిస్తున్న 10కే రన్ అంటే సిటీ రన్నర్లకు ఫుల్ క్రేజ్. ఈ మారథాన్‌లో రేస్‌గుర్రాల్లా పరిగెత్తడానికి సిటీవాసులు పగ్గాలు తెంచుకుని సిద్ధంగా ఉంటారు. బహుదూరం సాగే ఈ పరుగు పందెం టీనేజ్ కుర్రాళ్లకు ఆటవిడుపు.. ఓల్డేజ్ పెద్దలకు మధురానుభూతి. అందుకే మారథాన్ ఈవెంట్ అనగానే మారుమాట్లాడకుండా అందరూ సై అంటారు. ఈ రోజు 10కే రన్ సందర్భంగా ఇందులో పరుగులు తీయనున్న వారిని సాక్షి సిటీప్లస్ తరఫున స్టార్ రిపోర్టర్‌గా హీరో నవదీప్ పలకరించారు.
స్టార్ రిపోర్టర్ నవదీప్
నవదీప్: హాయ్.. ఎలా ఉన్నారు. అందరూ టికెట్లు తీసుకోవడంలో బిజీగా ఉన్నట్టున్నారు.
యా... వి ఆర్ ఫైన్.
నవదీప్: యస్.. ఇది మన హైదరాబాద్‌లో 12వ 10కే రన్. ఈ పన్నెండేళ్లలో 10కే రన్ సాధించిన ఘనత గురించి చెప్పండి?
డాక్టర్ శిల్పా: ఇట్స్ ఏ గ్రేట్ ఎచీవ్మెంట్. ఏటా నవంబర్ వచ్చిందంటే.. పరుగు ప్రేమికులంతా రోడ్డెక్కేస్తారు. ఈవెంట్‌కు చాలా రోజుల ముందు నుంచే ప్రాక్టీస్‌లో మునిగిపోతుంటారు. నగరవాసుల జీవన విధానంపై 10కే రన్ ఎఫెక్ట్ చాలానే ఉంది. నేను పదేళ్లుగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈసారి కూడా ట్రాక్‌పై సక్సెస్‌ఫుల్‌గా పరుగెత్తడానికి కసరత్తు చేస్తున్నాను.
నవదీప్: గుడ్.. నేను కూడా రెండు మూడు మారథాన్లలో పాల్గొన్నాను. కానీ 10కే రన్‌కు ఉండే క్రేజ్ చాలా డిఫరెంట్. ఇందులో పాల్గొనేవారంతా చాలా సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తారని విన్నాను. నిజమేనా..?
సుధ: యస్. కొందరైతే ఆరు నెలల ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తుంటారు. 10కే రన్ ఫౌండేషన్ సూచనల మేరకు రోజూ ఉదయం వాకింగ్, రన్నింగ్ చేస్తుంటారు. డైట్ కూడా చక్కగా మెయింటేన్ చేస్తారు. రన్లో పాల్గొనడానికి ఆరోగ్య సూత్రాలు ఫాలో అవుతారు.
నవదీప్: అప్పటికప్పుడు చేరే కొత్తవాళ్లు కూడా చాలామంది ఉంటారు కదా!
సుధ: రెగ్యులర్‌గా వచ్చేవాళ్ల కంటే.. ఫ్రెషర్సే ఎక్కువ మంది. అలాంటి వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కొన్ని రోజుల ముందు నుంచైనా ప్రాక్టీస్ చేయాలి. రన్ రోజే రంగంలోకి దిగితే.. కండరాలు పట్టేయడం, కాళ్లకు బొబ్బలు రావడం వంటి కాంప్లికేషన్స్ వస్తాయి. కొద్ది దూరం వెళ్లగానే నీరసం వచ్చేస్తుంది.
మురళి: ఇదొక గొప్ప వేడుకండి. ఈసారి 15 వేల మంది వరకూ పాల్గొంటున్నారు. హైదరాబాదీలే కాదు. దేశ, విదేశాల నుంచి రన్నర్స్ వస్తారు. ఒకే చోట ఇంత మంది రన్నర్స్‌ను చూడటానికి మించిన స్పెషల్ ఏముంటుంది. కొత్తవారికి ఫస్ట్‌టైం కాస్త ఇబ్బందైనా.. ఈ ఎక్స్‌పీరియన్స్‌తో వచ్చే ఏడాది ఈవెంట్‌కు ప్రిపేర్ అవుతారు.
నవదీప్: ఎగ్జాక్ట్లీ.. కొంత ఫ్రెండ్స్ దొరుకుతారు. బోలెడన్ని విషయాలు తెలుసుకోగలుగుతాం. అభిప్రాయాలు కలిస్తే సొసైటీకి పనికొచ్చే పనులు చాలా చేయొచ్చు.
శ్యామ్: అఫ్కోర్స్.. ఇప్పటికే చాలా చేస్తున్నారు. మన హైదరాబాద్ 10కే రన్నర్స్ క్లబ్లో మూడువేలకు పైగా సభ్యులున్నారు. వీరంతా గ్రూపులుగా తయారై సామాజిక సేవా కార్యక్రమాలు చాలా నిర్వహిస్తున్నారు.
నవదీప్: సుధగారూ! మీరు ఇప్పటివరకూ ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తారు?
సుధ: నేను 2011లో మొదటిసారి 10కే రన్లో పాల్గొన్న వారికి వాటర్ బాటిల్స్ ఇవ్వడానికి వచ్చాను. అప్పుడు 60 ఏళ్లు పైబడిన ఆడవారు పరిగెత్తడం చూశాను. అంత పెద్దావిడ పరుగెడుతుంటే.. నేనేంటి ఈ పని చేస్తున్నానని ప్రశ్నించుకున్నాను. నిజానికి నాకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అయినా పట్టుదలతో రన్నింగ్ ప్రాక్టీస్ చేశాను. మారథాన్ ఈవెంట్లలో పాల్గొన్నాను. నేను ఇప్పటి వరకు 24 మారథాన్లు పూర్తిచేశాను.
సుప్రియ: అదొక ప్రయోజనమైతే.. ఈ క్లబ్స్ ద్వారా రాష్ట్రాలు, దేశాలు దాటి పరుగులు తీసే అవకాశాలు కలుగుతాయి. నేను పూర్వం ఇక్కడ జరిగే మారథాన్స్లోనే పాల్గొనేదాన్ని. ఇప్పుడు ఢిల్లీ, బెంగళూరులో జరిగే మారథాన్ ఈవెంట్స్‌లో కూడా పాల్గొంటున్నాను.
సుధ: డెఫినెట్లీ.. ఎంత చదువుకున్నా.. ఏ స్థాయి ఉద్యోగాలైనా అన్ని ప్రాంతాలు తిరిగే అవకాశం రాకపోవచ్చు. ఈ రన్నింగ్ క్లబ్‌తో స్నేహం కుదిరితే మనకు తెలియకుండానే ఎందరినో కలవొచ్చు.. కొత్త ప్రాంతాలకు వెళ్లొచ్చు. గొప్ప ఎక్స్పీరియన్స్.
నవదీప్: ఓ.. గుడ్.. స్పోర్ట్స్‌ని ఇష్టపడే వారికి కూడా ఇది చాలా ఉపయోగకరం కదా!
శర్వాణి: చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా మెడల్స్, సర్టిఫికెట్స్ ఉంటాయి సర్.
నవదీప్: అవునా...
మురళి: అవునండీ. ఎవరిపాటికి వారు పరుగెత్తుకుంటూ వెళ్లిపోవడానికి ఇంత హడావుడి ఎందుకుంటుంది? నిర్ణీత సమయంలో గమ్యం చేరుకున్నవారికి రూ.1.75 లక్షల నగదు బహుమతి, మెడల్, సర్టిఫికెట్ అందజేస్తారు. ఏజ్ గ్రూప్స్‌ను బట్టి విజేతలను ఎంపిక చేస్తారు. ఈసారి బహుమతుల కోసమే రూ.35 లక్షలు వెచ్చిస్తున్నారు.
నవదీప్: పరుగు పందెం నియమాల సంగతేంటి?
మురళి: ముందుగా టికెట్ కొనుక్కోవాలి. దానితోపాటు ఒక నంబర్‌తో కూడిన ఎలక్ట్రానిక్ క్లాక్ ఒకటి ఇస్తారు. రన్నింగ్ సమయంలో రోడ్డుపై వారు పెట్టిన ఎలక్ట్రానిక్ మ్యాట్‌కి వెళ్లాక అందులో టైమ్ కౌంట్ మొదలవుతుంది. ఎంత సమయానికి ఎంత దూరం పరుగెత్తామో ఆ ఎలక్ట్రానిక్ క్లాక్ సాయంతో మా టెక్నికల్ టీమ్‌కు తెలిసిపోతుంది.
నవదీప్: సో.. ఎక్కడా చీట్ చేయడానికి అవకాశం లేదన్నమాట.
దేవయాని: నో వే. అయినా అంత చీట్ చేసి గెలవాల్సిన గేమ్ కాదు కదండి. కేవలం సెల్ఫ్ సాటిస్ఫ్యాక్షన్ కోసం చేసే పని.
సుప్రియ: ఓ నలుగురు కొత్త వ్యక్తులు కలిస్తేనే బోలెడన్ని విషయాలు తెలుస్తాయి. అలాంటిది ఇన్ని వేలమంది ఒక్కచోట కలిసి మన హైదరాబాద్రోడ్లపై హాయిగా పరుగెడుతుంటే వచ్చే ఆనందం ఎన్ని డబ్బులు ఖర్చు పెడితే మాత్రం దొరుకుతుంది చెప్పండి. ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్.
నవదీప్: అదొక్కటే కాదు..సమాజంలో జరుగుతున్న రకరకాల సంఘటనలపైనా రన్నింగ్ క్లబ్‌లు స్పందిస్తున్నాయి. దానికి హ్యాట్సాఫ్ చెప్పాలి.
మురళి: ష్యూర్.
నవదీప్: ఓకే ఫ్రెండ్స్.. ఇలా సాక్షి తర ఫున రిపోర్టర్‌గా మిమ్మల్ని పలకరించే అవకాశం దొరికినందుకు థ్యాంక్స్ చెబుతున్నాను.
బై...