మేధస్సుతో ఆడే క్రీడ చదరంగం
కడప స్పోర్ట్స్: మేధస్సుతో ఆడే క్రీడ చదరంగం అని నగరపాలకోన్నత పాఠశాల (మెయిన్) ప్రధానోపాధ్యాయుడు పి.వి. సుబ్బారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కడప నగరంలోని నగరపాలకోన్నత పాఠశాల (మెయిన్)లో జిల్లాస్థాయి ప్రభుత్వ పాఠశాలల చదరంగ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదరంగం క్రీడలో చాలామంది తెలుగు క్రీడాకారులు రాణిస్తున్నారని, హంపి, హరికృష్ణ, హారిక లాంటి క్రీడాకారులను ఆదర్శంగా తీసుకుని రాణించాలని సూచించారు. జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి అనీస్ దర్బారీ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే క్రీడాకారులకు మాత్రమే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల నుంచి ఐదుగురు బాలురు, ఐదుగురు బాలికలను ఎంపికచేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. ఎంపికైన వారు ఈనెల 18, 19 తేదీల్లో విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణారెడ్డి, చీఫ్ ఆర్బిటర్ బాలాజీ, వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటలక్ష్మి, సునీత పాల్గొన్నారు.