మన ఉత్తమ కమాటికి ఫొటో అవార్డు
లండన్: అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమస్యలపై ఆట్కిన్స్ సివెమ్ (సీఐడబ్లూఈఎం) నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో భారత్‌కు చెందిన ఔత్సాహిక ఫొటోగ్రాఫర్ ఉత్తమ కమాటి తీసిన ఫొటోకు ఉత్తమ ఫొటో అవార్డు లభించింది. భారత్ లోని తీస్తా నది నుంచి ఓ పైపు ద్వారా సూదూరానున్న తమ పుచ్చకాయల పంటకు నీరు పెడుతున్న ఓ దంపతుల శ్రమైక జీవన చిత్రమిది.
ఈ ఫొటోకుగాను కమాటికి లక్ష రూపాయల బహుమతిని అందజేశారు. మొత్తం 60 దేశాల నుంచి ఫొటోగ్రాఫర్లు, ఫిల్మ్‌మేకర్స్ నుంచి దాదాపు పదివేల ఫొటోలు పోటీకి రాగా అందులో 111 ఫొటోలను ఎంపిక చేశారు. వివిధ కేటగిరీల కింది వీటికి ఉత్తమ, ద్వితీయ, తృతీయ ఫొటో అవార్డులను ప్రకటించారు. నగరంలోని దక్షిణ కెన్సింగ్ఘన్లోని రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ వేదికపై ఈ 111 ఫొటోలను ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శన జూలై పదవ తేదీ వరకు కొనసాగుతుంది.
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ‘చార్టర్డ్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ వాటర్ అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ (సీఐడబ్లూఈఎం)’ 2007లో ఈ అంతర్జాతీయ అవార్డును ఏర్పాటు చేసింది. అంతర్జాతీయంగా పేరుపొందిన బ్రిటన్ బహుళార్థక ఇంజనీరింగ్ కంపెనీ ‘ఆట్కిన్స్’ అవార్డులకు ఆర్థిక సహాయం చేస్తుండడంతో ఈ అవార్డుకు ‘ఆట్కిన్స్ సివెమ్’ అని పేరుపెట్టారు.