అలా చేస్తే రాహుల్‌కు జ్ఞానోదయం అవుతుందేమో!
- రాహుల్ గాంధీపై ఎంపీ కవిత సెటైర్లు
బూర్గంపాడు: కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీఏ పాలనలో రైతులను, వారి సక్షేమాన్న విస్మరించిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు రైతులను ఉద్ధరిస్తున్నట్లు ప్రచారం కోసం పర్యటనలు చేయడం హాస్యాస్పదమన్నారు. పదేళ్లపాలనలో చేసిన పాపాలు పోవాలంటే ఆయన (రాహుల్ గాంధీ) తెలంగాణలోనో, ఆంధ్రలోనో పుష్కరస్నానం చేస్తేనన్నా జ్ఞానోదయమవుతుందని హితవు పలికారు.
ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోతెఘాట్‌లో పుష్కర పూజల అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలసి ఎంపీ కవిత విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తొలిఏడాదికే వచ్చిన గోదావరి మహాపుష్కరాలను రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. ఎమ్మెల్యే జలగం వెంకటరావు చొరవతో ఏర్పాటు చేసిన మోతె పుష్కరఘాట్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. గవర్నర్‌తో పాటు పలువురు వీఐపీలు ఇక్కడ పుష్కరస్నానమాచరిస్తున్నారని తెలిపారు. రెండు రాష్ట్రాలలోని తెలుగువారంతా సుభిక్షంగా, సుఖసంతోషాలతో ఉండాలని గోదావరి మాతను ప్రార్థించామన్నారు.