పార్లమెంటులో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి
బిల్లుకు చట్టబద్ధత కల్పించేంత వరకు పోరాటం ఆగదు
ఎస్సీ కారొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి
చేవెళ్ల: పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి.. చట్టబద్ధత కల్పించేంతవరకు పోరాటం ఆగదని రాష్ట్ర ఎస్సీ కారొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. వర్గీకరణే ప్రధాన ఎజెండాగా ఆగస్టు 8,9,10 తేదీల్లో నిర్వహించతలపెట్టిన ‘ఢిల్లీపై మాదిగల దండయాత్ర‘ పోస్టర్‌ను ఆయన రాష్ట్ర మాదిగ జేఏసీ కన్వీనర్ జోగు అశోక్‌కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నా.. కేంద్రం ప్రభుత్వం మాత్రం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి తీవ్ర జాప్యం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికే మాదిగలకు విద్య, ఉద్యోగ రంగాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని, వర్గీకరణతోనే తమకు న్యాయం జరుగుతుందని మాదిగలు ఆశిస్తున్నారని చెప్పారు.
దామాషా ప్రకారం మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన బిల్లుకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. తాము ఇతరులకు అన్యాయం చేయాలని కోరుకోవడం లేదని, తమకు మాత్రం న్యాయం చేయాలని అర్థిస్తున్నామని తెలిపారు. పార్లమెంటులో వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించేంతవరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. టీఎంజేఏసీ రాష్ట్ర కన్వీనర్ జోగు అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కోరుతూ వచ్చే నెలలో 8 నుంచి 10 రోజులపాటు ఢిల్లీలో నిర్వహించనున్న ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి అధికసంఖ్యలో హాజరు కావాలని కోరారు. పోరాడితేనే హక్కులను సాధించుకోగలుగుతామన్నారు. వర్గీకరణ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో టీఎంజేఏసీ రాష్ట్ర, జిల్లా నాయకులు పెరికె కరణ్ జయరాజ్, గద్దెల అంజిబాబు, తలారి వెంకటేష్, ఈరని మహేష్, చంటి, బాబు, చరణ్, భూపాల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.