మట్టి మాఫియా!
తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల పేట్రేగిపోతున్నారు. పచ్చని పల్లెల్లో పుడమితల్లికి గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు. భూ దందాలకుతోడు చివరకు మట్టిని సైతం అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. చెరువులను మింగుతున్నారు. సాగునీటి కాలువలనూ కబళిసున్నారు. పార్టీ అధికారంలోకి రావడంతో అధికారులను బెదిరిస్తున్నారు. అందినకాడికి దోచేస్తున్నారు.
- తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల కొత్త అవతారం
- అధికారులను బెదిరిస్తూ చెరువులను అడ్డంగా తవ్వేస్తున్న వైనాలు
- ట్రాక్టరు మట్టి రూ. వెయ్యి వంతున విక్రయాలు
- రాత్రికి రాత్రే వందల కొద్దీ ట్రాక్టర్లలో తరలింపు
- కట్టడి చేయడంలో రెవెన్యూ,పోలీస్, మైనింగ్ శాఖలు విఫలం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లాలో అనేక గ్రామాల్లో మట్టి తవ్వకాలు అక్రమంగా జరుగుతున్నాయి. అధికార పార్టీ కార్యకర్తలు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఇరిగేషన్, డ్రైనేజి కాలువలు, చెరువుల్లోని మట్టిని తవ్వేస్తున్నారు. దీనిని నిలువరించడానికి ప్రయత్నించిన అధికారులకు దుందుడుకు సమాధానాలు చెబుతున్నారు. పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చాం...సంపాదించుకోకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.
అదేమంటే మంత్రికి చెబుతామని, ఇక్కడ పని చేసుకోవాలనిలేదా... అంటూ పరుష పదజాలాన్ని వినియోగిస్తున్నారు. రాత్రికి రాత్రి వందల కొద్దీ ట్రాక్టర్లు,టిప్పర్లలో మట్టిని తరలిస్తూ లక్షలాది రూపాయాలు సంపాదిస్తున్నారు.
* భారీ పొక్లయిన్లు, టిప్పర్లు, ట్రాక్టర్లను ఈ అక్రమ వ్యాపారానికి వినియోగిస్తున్నారు. బాహాటంగా జరుగుతున్న ఈ తవ్వకాలను కూడా రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖలు కట్టడి చేయలేకపోతున్నాయి.
* ఒక ట్రాక్టరు ట్రక్కు మట్టిని రూ.600 నుంచి రూ.1000 వరకు అమ్ముతున్నారు. టిప్పరు మట్టి ధర రూ.2 వేలకుపైగానే ఉంటుంది.
వారం రోజుల వరకు జిల్లాలోని అనేక చెరువుల్లో ఈ తవ్వకాలు భారీ ఎత్తున జరిగాయి.
* చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడు మండలం, గుంటూరు రూరల్‌లోని లాల్పురం, పొత్తూరు, చౌడవరం, ఓబులునాయుడుపాలెం, దాసుపాలెం, నాయుడుపేట, లింగాయపాలెంలోని తాగు నీటి చెరువుల్లో పూడిక తీతపేరుతో అక్రమ తవ్వకాలు జరిగాయి.
* యడ్లపాడు మండలంలోని మైదవోలు లింగాపురం గ్రామానికి వెళ్లే మార్గంలో పోలేరమ్మ గుడి సమీపంలోని సాగునీటి చెరువులో రెండురోజుల వరకు భారీ ఎత్తున అక్రమ తవ్వకాలు జరిగాయి. గ్రామస్తులు, గ్రామ సర్పంచ్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. పొక్లయిన్ల సహాయంతో జరిగిన ఈ తవ్వకాలకు అన్ని శాఖల అధికారులు పరోక్షంగా సహకరించారని, వేలాది రూపాయలను మామూళ్లుగా తీసుకున్నారనే ఆరోపణలు బాహాటంగా వినపడుతున్నాయి. వర్షం కారణంగా ఒకటి రెండు రోజుల నుంచి తవ్వకాలు నిలిపివేశారు. మళ్లీ ఈ తవ్వకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని, ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
* గుంటూరు రూరల్‌లోని నాయుడుపేట, చౌడవరం, వెంగళాయపాలెం, పేరేచర్ల, తదితర ప్రాంతాల్లో చిన్న పలకలూరు గ్రామానికి చెందిన నాయకులు ప్రభుత్వం భూముల్లో సైతం రాత్రికి రాత్రి పొక్లెయిన్లతో మట్టిని తవ్వి అమ్మకాలు సాగించారు.
* రోజుకు వంద ట్రాక్టర్లు వినియోగించి వెయ్యి ట్రిప్పుల వరకు అమ్మకాలు సాగించినట్టు తెలుస్తోంది. వారం రోజులపాటు జరిగిన ఈ అక్రమ తవ్వకాలపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి కేంద్రీకరించి అక్రమార్కుల నుంచి సీనరేజ్, సెస్‌లను పెనాల్టీతో వసూలు చేయాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇరిగేషన్, డ్రైనేజి కాలువలు, కరకట్టలను వదలడం లేదు.
* మట్టిమాఫియా కాలువలను కూడా వదలడం లేదు. ఇంకా కాలువలకు పూర్తి స్థాయిలో నీటి విడుదల జరగకపోవడంతో ఎటువంటి అనుమతులు లేకుండా కాలువల్లో మట్టిని పొక్లయిన్ల సహాయంతో తవ్వుతున్నారు.
* కొన్ని కాలువల్లో మట్టిని ఎక్కువ లోతులో తవ్వడం వల్ల అక్కడి నుంచి నీటిపారు దల సక్రమంగా జరగదని, స్థానిక ప్రజలు అక్కడ కాలువ లోతు ఎక్కువుగా ఉందని తెలియక మునిగి మృతి చెందే ప్రమాదం ఉందని ఇరిగేషన్‌శాఖ అధికారులు చెబుతున్నారు.
* ఇంత వరకు కాలువల్లో మట్టి తవ్వకాలకు ఇరిగేషన్‌శాఖ ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని, ఎక్కడైనా తవ్వకాలు జరుగుతుంటే సమీపంలోని రెవెన్యూ, పోలీస్ అధికారు లకు ఫిర్యాదు చేయాలని ఇరిగేషన్‌శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.
* కాలువల కరకట్టలను తవ్వడం వల్ల అవి బలహీనమై వరదలకు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఇరిగేషన్‌శాఖ అధికారులు చెబుతున్నారు.
* ఈ అక్రమ మట్టి తవ్వకాలు ఎక్కువగా రేపల్లె, నదీ పరివాహక ప్రాంతాల్లో జరుగుతుండటంతో అక్కడ నిఘా పెంచినట్టు అధికారులు చెప్పారు.