ముఖ తేజస్సుకు...
పదే పదే ముఖం శుభ్రం చేస్తే పదింతల మేలు అనేది మీ ఆలోచనా?! అయితే వెంటనే ఆ అలవాటుకు స్వస్తి పలకండి. ఎందుకంటే...
అతిగా కడగడం: ముఖాన్ని రోజులో ఎక్కువ సార్లు శుభ్రం చేయడం వల్ల చర్మంపై సహజమైన నూనెలు తగ్గిపోయి, పొడిబారుతుంది. పొడిబారిన చర్మం త్వరగా ముడతలు పడుతుంది. రోజుకు రెండుసార్లు ఉదయం, రాత్రి పడుకునేముందు ముఖాన్ని ‘మైల్డ్ సోప్ లేదా ఫేస్‌వాష్’తో శుభ్రం చేసుకోవాలి.
పొడిచర్మం: ముఖాన్ని శుభ్రపరుచుకున్న వెంటనే చాలాసార్లు దురదగా అనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు మీది పొడి చర్మం అని గమనించాలి. సబ్బు లేదా ఫేసియల్ ఫోమ్ మీ చర్మతత్వానికి సరిపడటం లేదని తెలుసుకోవాలి. ఇలాంటప్పుడు ముఖం కడిగిన తర్వాత లోషన్ లేదా నూనె రాసుకోవాలి. పొడి చర్మం గలవారు క్లెన్సర్స్ ఉపయోగించకపోవడమే మేలు.
వేడినీళ్లు: చర్మం తన సహజసిద్ధమైన నూనెలను కోల్పోకుండా ఆరోగ్యంగా ఉండాలంటే వేడినీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోకూడదు. బయటి ఉష్ణోగ్రతలను బట్టి చర్మం తట్టుకోగలిగేటంత గోరువెచ్చని నీటిని ఉపయోగించవచ్చు.
మాయిశ్చరైజింగ్ వాడకపోవడం: జిడ్డు చర్మం గలవారు ఈ టిప్‌ను అనుసరించాల్సిన పనిలేదు. సాధారణ, పొడి చర్మం గలవారు ముఖాన్ని శుభ్రం చేసుకున్న వెంటనే మంచి మాయిశ్చరైజర్‌ని రాసుకుంటే రోజంతా చర్మం మృదువుగా ఉంటుంది.
అందమె ఆనందం