పొలిటికల్ ట్రాన్స్‘ఫర్’లు
ఉద్యోగుల బదిలీల్లో ‘పచ్చ’పాతం
అధికారులపై మంత్రి ఒత్తిళ్లు
అస్మదీయులకు కీలక స్థానాలు
విశాఖ రూరల్ : ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సిఫార్సులు పెచ్చు మీరుతున్నాయి. సస్పెన్షన్కు గురి కావాల్సిన వారికి కొమ్ముకాయడంతో పాటు వారిని కీలక స్థానాల్లో నియమించాలని నాయకులు పట్టుబడుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరికి వారు తమకు కావాల్సిన ఉద్యోగుల జాబితాలను జిల్లా అధికారులకు పంపిస్తూ ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. రెవెన్యూలో బదిలీ ప్రక్రియపై రాజకీయ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
క్లీన్ రికార్డు ఉన్న వారిని కీలక స్థానాల్లో వేయాలని కలెక్టర్ భావిస్తున్నప్పటికీ.. ప్రజాప్రతినిధులు అడ్డు తగులుతున్నట్టు సమాచారం. ఎన్నికల సమయంలో టీడీపీకి వ్యతిరేకంగా వ్యవహరించారన్న అనుమానం ఉన్న వారిని మారుమూల ప్రాంతాలకు పంపించడానికి అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
నేతల ఇళ్లకు క్యూ
ఉద్యోగులు ఆశించిన స్థానాన్ని దక్కించుకోవడానికి మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముందు క్యూలు కడుతున్నారు. విశాఖ రూరల్ తహశీల్దార్ స్థానం కోసం జిల్లాలో ఆరుగురు పోటీ పడుతున్నారు. రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలు ఖర్చు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారని తెలిసింది. ఆనందపురం, భీమిలి, పెందుర్తి, గాజువాక తహశీల్దార్ స్థానాల కోసం పోటీ ఎక్కువగా ఉంది. ఈ స్థానాల కోసం రూ.10 లక్షల వెచ్చించేందుకూ వెనుకాడడం లేదు.
అవినీతి అధికారులకు కొమ్ము
ప్రజాప్రతినిధులు రెవెన్యూ, పోలీసు శాఖల్లో అక్రమాలకు పాల్పడుతున్న అధికారులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఇసుక మాఫియా, రంగురాళ్ల ముఠా, భూకబ్జాదారులతో చేతులు కలిపినట్టు ఆరోపణలున్నవారిపై వేటు పడకుండా చూస్తున్నారు. ఆనందపురం తహశీల్దార్ కార్యాలయంలో అధికారులపై అనేక ఆరోపణలు ఉన్నాయి. అదనపు జాయింట్ కలెక్టర్ వై.నరసింహారావు విచారణ జరిపి నివేదిక సమర్పించినా.. ఒక మంత్రి అండదండల కారణంగా అక్కడి అధికారులపై చర్యలు తీసుకోలేకపోయారు. తాజాగా అక్కడి వారిని అంతకంటే మంచి స్థానాల్లో నియమించాలని సదరు మంత్రి అధికారులకు సిఫార్సు చేసినట్టు సమాచారం.
ఎవరి జాబితా వారిదే
కీలకమైన శాఖల్లో తమకు కావాల్సిన అధికారులు, సిబ్బంది జాబితాలను ఎమ్మెల్యేలు సిద్ధం చేసుకున్నారు. వాటి ప్రకారం వారికి పోస్టింగ్లు కల్పించాలంటూ జిల్లా అధికారులకు హుకుం జారీ చేశారు. అధికారులు ఆ సిఫార్సులను పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యేలు మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి జిల్లా ఉన్నతాధికారులతో రహస్య సమావేశాన్ని నిర్వహించి ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితాతో పాటు తన జాబితా కూడా అధికారులకు అందించినట్టు సమాచారం.
తలలు పట్టుకుంటున్న అధికారులు
ఉద్యోగులు ఎవరికి వారు మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి సిఫార్సులు చేయించుకుంటుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒక మంత్రి ఏకంగా 30 మంది ఉద్యోగుల జాబితా ఇచ్చి అందులో ఉన్న విధంగా పోస్టింగ్లు వేయాలంటూ ఒక ఉన్నతాధికారికి చెప్పగా.. అందుకు ఆయన అంగీకరించలేనట్టు తెలిసింది. అంతమందిని మీకు నచ్చినట్టు వేయలేమని సదరు ఉన్నతాధికారి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. బదిలీలకు వచ్చే నెల పదో తేదీ వరకు గడువు ఉన్నా ఈ నెలలోనే పూర్తి చేయాలని అన్ని శాఖల అధికారులు కసరత్తు చేస్తున్నారు.