తిరునగరికి జ్వరం
తిరుపతి కార్పొరేషన్: తెరపనివ్వకుండా కురుస్తున్న వర్షం, వణికిస్తున్న చలితో తిరుపతి ప్రజలు జ్వరాల బారిన పడ్డారు. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పు కారణంగా వందలమందికి జ్వరం సోకింది. వీరిలో కొందరు డెంగీయేమో అని భయపడ్డారు. అం దరూ రుయా, స్విమ్స్‌కు క్యూ కట్టారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి సాధారణ జ్వరాలేనని తేల్చారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు.
మూడు రోజులుగా కురుస్తున్న వర్షంతో పలు సీజనల్ వ్యాధులు పీడిస్తున్నాయి. దీంతో తిరుపతి నగరం తో పాటు పరిసర ప్రాంతాలనుంచి రుయా ఆస్పత్రికి రోగులు క్యూ కడుతున్నారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దాదాపు 1800 మంది అవుట్ పేషెంట్లు పలు వ్యాధులకు వైద్య సేవలు పొందారు. ముఖ్యంగా విషజ్వరాలు, దగ్గు, సాధారణ జ్వరాలు,జలుబు వంటి వ్యాధులకు పరీక్షలు చేయించుకున్నారు. డెంగీ లక్షణాలు ఉన్నాయన్న భయంతో వచ్చిన వారు ఎక్కువగా ఉండడం విశేషం.
వీరికి పరీక్షలు నిర్వహించి ప్రమాదం లేదని వైద్యులు మందులు ఇచ్చి పంపించారు. సాధారణంగా ప్రతి సోమవారం వెయ్యి నుంచి 1,200 వందల మంది రోగులు ఓపీకి వస్తుంటారని, అయితే వరుస వర్షాల ప్రభావంతో ఒకేరోజు 1,800 మంది వరకు రావడం రికార్డుగా వైద్యులు తెలిపారు. ఇక స్విమ్స్‌లోనూ ఓపీల ద్వారా జ్వరం, దగ్గు, జలుబుకు వైద్య సేవలు పొందిన వారు ఉన్నారు.
అయితే వైద్యులు మాత్రం వాతావరణంలో మార్పుల వలనే ఇలాంటి జ్వరాలు వస్తున్నాయని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వేడి చేసి చల్లార్చిన, గోరు వెచ్చని నీటిని మాత్రమే తాగాలని, కూల్డ్రింకులు, ఐస్‌క్రీంలు, తీపి వుస్తువులకు దూరంగా ఉండాలని చెప్పారు.