కతార్ ఇన్వెస్ట్‌మెంట్‌కు సహారా విదేశీ హోటళ్లు!
నేడు సుప్రీం అనుమతికి పిటిషన్..
న్యూఢిల్లీ : విదేశాల్లోని మూడు హోటళ్లలో వాటాల విక్రయానికి సహారా గ్రూప్‌కు లైన్ క్లియర్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. హోటళ్లను 1.6 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.10,720 కోట్లు) కతార్ ఇన్వెస్ట్‌మెంట్‌కు విక్రయించడానికి ఒక అవగాహన కుదిరినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. మూడు హోటళ్లలో ఒకటి లండన్‌లో (గ్రాస్‌వీనర్) ఉండగా, మరో రెండు న్యూయార్క్ ప్లాజా, డ్రీమ్ డౌన్‌టౌన్ (న్యూయార్క్)లో ఉన్నాయి.
అమ్మకం ద్వారా వచ్చే మొత్తం నిధుల్లో తన ప్రధాన రుణ దాత రూబిన్ బ్రదర్స్‌కు 995 మిలియన్ డాలర్లను కంపెనీ చెల్లించే వీలుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అమ్మకం ప్రక్రియకు ఆమోదం కోసం సహారా శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నదని తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆమోదం లభిస్తే, అమ్మకం ప్రక్రియ పూర్తికి దాదాపు 2 నెలలు పడుతుంది. రెండు గ్రూప్ సంస్థలు- ఇన్వెస్టర్లకు డబ్బు తిరిగి చెల్లించలేని కేసులో... రెండేళ్ల పాటు తీహార్ జైలులో ఉన్న సహారా చీఫ్ సుబ్రతారాయ్ ప్రస్తుతం పెరోల్‌పై ఉన్నారు. ఈ కేసులో బెయిల్ పొందడానికి సహారా చీఫ్ రూ.10,000 కోట్లు చెల్లించాల్సి ఉంది.