పోటాపోటీగా నిరసనలు
ఆత్మకూర్ : కొందరు మహబూబ్‌నగర్‌లోనే కొనసాగుతామని రెండు రోజులుగా బంద్ నిర్వహిస్తుండగా.. మరికొందరు వనపర్తి జిల్లాలోనే ఉంటామని భారీ బైక్ ర్యాలీ తీశారు. ఇలా పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో నిరసనలు, ఆందోళనలతో ఆత్మకూర్ అట్టుడికిపోయింది. మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో ఆత్మకూర్, చిన్నచింతకుంట, అమరచింత మండలాలను పాలమూరులోనే కొనసాగించాలని రెండోరోజూ బంద్ కొనసాగింది. స్థానిక గాంధీచౌక్‌లో రాస్తారోకో నిర్వహించడంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి చిన్నచింతకుంట పోలీస్టేషన్‌కు తరలించారు.
దీని నిరసిస్తూ ముగ్గురు యువకులు సెల్‌టవర్ ఎక్కి హల్చల్ చేశారు. జేఏసీ నాయకుల విడుదల అనంతరం తహసీల్దార్ ప్రేమ్‌రాజు, ఎస్ఐ సీహెచ్ రాజుసూచన మేరకు ఆ యువకులు కిందికి దిగారు. అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం‡వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించి వినతిపత్రం అందించారు. అటుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోనే ఉంటామని ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు బాలకిష్టన్న, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు నరేష్‌రెడ్డి బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎలాంటి ఉద్రిక్తలు చోటుచేసుకోకుండా గద్వాల డీఎస్పీ బాలకోటి, సీఐ ప్రభాకర్‌రెడ్డి నేతత్వంలో పోలీసు బలగాలను మోహరించారు.