ఓట్లకు గాలం పథకాలకు ప్రాధాన్యం
సాక్షి, ముంబై: త్వరలో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికలకు అధికార పక్షం కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లూ చేసుకుంటోంది. ఓట్లు తెచ్చిపెట్టే ప్రాజెక్టులు, పథకాలపై మంత్రిమండలి దృష్టి సారించింది. ఎన్నికల ప్రచారం వ్యూహాన్ని ఖరారు చేసేందుకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితిని అంచనా వేయడానికి కాంగ్రెస్ 288 మంది సమన్వయకర్తలను నియమించింది. దాదర్‌లోని తిలక్‌భవన్‌లో నిర్వహించిన డీసీసీ అధ్యక్షులు, ఆఫీసు బేరర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల వ్యూహాన్ని చర్చించడానికే కాంగ్రెస్ శనివారం ఈ భేటీని ఏర్పాటు చేసింది. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను మంజూరు చేయించుకుని ప్రజలను ఆకట్టుకోవాలని ఎమ్మెల్యేలు, మంత్రులు యోచిస్తున్నారు. అన్ని కీలక ప్రాజెక్టులకు వెంటనే మంజూరు తెలపాలని ముఖ్యమంత్రికి సూచించారు. తమ ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు సత్వరం అనుమతులు మంజూరు చేయాలంటూ కొందరు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు సమాచారం. మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటికి ముందే రాష్ట్ర ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. దీంతో రాబోయే రోజుల్లో జరగబోయే మంత్రి మండలి సమావేశాల్లో అనేక కీలక ప్రాజెక్టులకు మోక్షం లభించవచ్చు.
ప్రజలకు తెలియకపోవడం వల్లే..
లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నా, ప్రజాస్వామ్య కూటమికి ఇవేవీ ఓట్లు రాల్చలేదని సమాచారం. వీటి గురించి ప్రజలకు తెలియకపోవడమే ఇందుకు కారణమని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. రెండు వేల మురికివాడల క్రమబద్ధీకరణ, ఠాణే, నవీముంబైలో ‘క్లస్టర్ యోజన’, విద్యుత్‌బిల్లులపై 20 శాతం రాయితీ తదితర అనేక జనాకర్షణ పథకాలను లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రకటించారు.అయినా రాజకీయంగా పెద్దగా ప్రయోజనం కలగలేదని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అధిష్టానానికి పంపించిన నివేదికలో తెలిపినట్టు సమాచారం.
దీంతో అసెంబ్లీ ఎన్నికల కోసం మరిన్ని జనాకర్షణ పథకాలను రూపొందించే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే వీటి గురించి ముందస్తుగానే ప్రజలందరికీ తెలియజేసేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావాలంటే పెండింగ్ ప్రాజెక్టులన్నింటిపై నిర్ణయాలు తీసుకోవాలని మంత్రిమండలి కోరుకుంటోంది. మూడున్నరేళ్ల క్రితం సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చవాన్ కీలకమైన నిర్ణయాలు తీసుకునే సాహసం ఎప్పుడూ చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే విమర్శిస్తున్నారు. అధిష్టానం ఒత్తిడి కారణంగా లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలుకు ముందుగానే మురికివాడల క్రమబద్ధీకరణ, క్లస్టర్ యోజనను అమలు చేయనున్నట్టు ప్రకటించారు. దీంతోపాటు విద్యుత్ బిల్లులపై 20 శాతం రాయితీలు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ఆహార భద్రతతోపాటు పలు పథకాలకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పెద్దగా ప్రయోజనం కలగలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
పెండింగ్ ప్రాజెక్టులపై ఆరా...?
పెండింగ్ ప్రాజెక్టుల్లో ఏవి కీలకమైనవో తెలుసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో సీఎం, మంత్రులు తరచూ భేటీలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. కీలక ప్రాజెక్టులు, ప్రతిపాదనలను వెంటనే మంత్రిమండలి సమావేశంలో ప్రవేశపెట్టాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ పరిస్థితిని గమనిస్తే అనేక కీలక ప్రాజెక్టులకు త్వరలోనే ఆమోదం లభించే అవకాశాలున్నాయి.