పేదల భూములు బంధువులకు సంతర్పణ
సీఎంపై ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా విమర్శ
దివీస్‌తో ప్రజలకు ఎంతో నష్టం
3 వేల ఉద్యోగాల కోసం 10వేల మంది పొట్ట కొడతారా
దానవాయిపేట (తుని రూరల్) : అభివృద్ధి పేరుతో పేదల భూముల్ని లాక్కుని బంధువులకు, అనుంగులకు భూ సంతర్పణ చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తగదని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అభివృద్ధి నిరోధకులంటూ ప్రజలను సీఎం తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. దివీస్ పరిశ్రమను స్థానిక ఎమ్మెల్యేగా తాను అడ్డుకుంటున్నట్టు పలు సందర్భాల్లో సీఎం అనడం విడ్డూరంగా ఉందన్నారు. తొండంగి మండలం దానవాÄæుపేటలో మేరుగుల ఆనంద లహరి ఇంటివద్ద ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రమాదకర దివీస్ పరిశ్రమ ఏర్పాటు వల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. దివీస్‌కు ఎస్ఈజెడ్ భూములను కేటాయించినట్టు చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. దివీస్ పరిశ్రమ నుంచి 17 రకాల ప్రమాదకర రసాయనాలు వెలువడడం వల్ల స్థానికులు వ్యాధుల బారిన పడే ప్రమాదముందని చెప్పారు. విశాఖ జిల్లా ప్రజలు తరిమికొట్టడంతో ఈ ప్రాంతంలో తిష్ట వేసేందుకు దివీస్ యాజమాన్యం ప్రయత్నిస్తోందన్నారు. దివీస్ పరిశ్రమలో రోజుకు 13,500 లీటర్ల నీటిని రసాయనాల్లో వినియోగిస్తారని, ఆ నీటిని శుద్ధి చేస్తామనడం హాస్యాస్పదమని రాజా విమర్శించారు. తయారు చేసిన మందులవల్ల వచ్చే మొత్తాన్ని ఖర్చు చేసినా ఆ నీటిని శుద్ధి చేయడానికి చాలదన్నారు. వ్యర్థ రసాయనాలు సముద్రంలో చేరడంవల్ల మత్స్యసంపదకు, మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఈ పరిశ్రమవల్ల 3 వేల మందికి వచ్చే ఉద్యోగాలు కోసం 10 వేల మంది రైతులు, పేదలు, మత్స్యకారుల పొట్ట కొట్టడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. తొండంగి మండలం జిల్లాలోనే ప్రశాంతంగా ఉండే ప్రాంతమని, ఇక్కడ క్రైం రేటు తక్కువగా ఉంటుందని వివరించారు. దానవాÄæుపేట కలెక్టర్ దత్తత గ్రామమని, 48 రోజులుగా 144 సెక్షన్ అమలులో ఉన్నా ఇక్కడ ఏం జరుగుతోందో ఆయన పరిశీలించకపోవడమేమిటని ప్రశ్నించారు. దివీస్ బాధితులకు అండగా ఉంటామని రాజా మరోమారు స్పష్టం చేశారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జీ మాట్లాడుతూ, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ చట్ట ప్రకారం సముద్ర తీరం నుంచి అరకిలోమీటరు లోపు ఎటువంటి పరిశ్రమలూ ఏర్పాటు చేయరాదని, అటువంటిది ఇక్కడ దివీస్ పరిశ్రమ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, అటువంటిది దివీస్ పరిశ్రమకు పోలీసుల రక్షణ కల్పించడమేమిటని నిలదీశారు. హైకోర్టు స్టేటస్కో ఉండగా పోలీసుల సహాయంతో పనులు చేయించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజలు తమ అభిప్రాయం తెలియజేసేందుకు సభ పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదని, దీనిపై కోర్టును ఆశ్రయించామని, అనుమతి లభించిన వెంటనే సభ నిర్వహిస్తామని చెప్పారు. విశాఖలో దివీస్‌ను తరిమేసినట్టే ఇక్కడ నుంచి కూడా తరిమేస్తామని హెచ్చరించారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చొక్కా కాశి తదితరులు పాల్గొన్నారు.