కేజ్రీవాల్ కు 'సుప్రీం' మొట్టికాయలు
న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. మీడియాపై క్రిమినల్ పరువునష్టం చర్యలు చేపట్టాలన్న కేజ్రీవాల్ నిర్ణయాన్ని గురువారం సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మీడియాపై ఆప్ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. మీడియాపై తన వ్యక్తిగతంగా పరువు నష్టం దావా అంశంతో, మీడియాపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ సీఎం కోరడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది.
తమ పార్టీని నాశనం చేసేందుకు మీడియా సుపారీ తీసుకుందని, మీడియా అమ్ముడుపోయిందంటూ గత వారం కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వాక్ స్వాతంత్ర్యపు హక్కును కోల్పోతున్నానని భావించిన కేజ్రీవాల్ మీడియాపై చర్యలకు దిగారు. ఆప్ సర్కారుపై గానీ, సీఎం పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్న మీడియా కథనాలపై కేసులు రిజిస్టర్ చేయమని అన్ని శాఖల అధికారులకు గత వారం ఆయన సూచించారు. మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేసే అధికారాన్ని కేజ్రీవాల్ సర్కారు గతంలో జీవో తీసుకురావడం గమనార్హం.