ఓపీఎస్.. ఈపీఎస్.. మధ్యలో సెంగొట్టియాన్
చెన్నై : తమిళనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతున్నాయి. విలీనమైన ఈపీఎస్-ఓపీఎస్లు చిన్నమ్మ శశికళ కుటుంబాన్ని పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి వెలివేశారు. అమ్మ జయలలిత మరణం తర్వాత ముఖ్యమంత్రిగా రాత్రికి రాత్రి పదవి స్వీకరించి, అనంతరం జరిగిన పరిణామాల్లో పార్టీకి, సీఎం పదవికి కూడా దూరమైన పన్నీర్ సెల్వం.. ఎలాగైనా ఆ పదవిని మరోసారి చేపట్టాలన్న ఆశతో ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి పదవి తనకే ఉంచి.. ప్రధాన కార్యదర్శి పదవి తీసుకోవాలని ఓపీఎస్కు పళనిస్వామి ఆఫర్ ఇచ్చారు. సరిగ్గా ఇదే అంశం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
ప్రధాన కార్యదర్శి పదవి మీద సీనియర్ నాయకుడు సెంగొట్టియాన్ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ పదవిని పన్నీర్ సెల్వానికి ఇస్తే ఆయన సంగతి ఏమవుతుందో తెలియాల్సి ఉంది. తాను ఈ పదవికి పోటీలో ఉన్నానని సెంగొట్టియాన్ ముందునుంచే చెబుతున్నారు. కానీ ఆయనకు ఇప్పుడు కొత్త చిక్కులు ఎదురయ్యేలా ఉన్నాయి. రెండు వర్గాల డిమాండ్లతో తమిళ రాజకీయాలు మరోమారు ఆసక్తికరంగా మారాయి. ఈ డిమాండ్ల నేపథ్యంలో చర్చలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేయాలని రెండు వర్గాలు నిర్ణయించాయి.