అనాథ బాలికల చదువుల బాధ్యత ప్రభుత్వానిదే
గజ్వేల్: ‘సార్... తల్లిదండ్రులు లేని అనాథలం మేం.. కస్తూర్బా పాఠశాల పుణ్యమా అని పదోతరగతి దాకా చదివినం.. ఇకముందు ఎక్కడికి వెళ్లి చదువుకోవాలో అర్థమైతలేదు.. మీరే మాకు మార్గం చూపాలి..’ అంటూ మెదక్ జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లిలో శనివారం ‘సీఎం ఫ్రెండ్లీ కప్’ ముగింపు కార్యక్రమంలో గజ్వేల్ కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు రేణుక, రమ్య చేసిన విన్నపం సీఎం కేసీఆర్ను కదిలించింది. ఆ చిన్నారుల బాధ తనను మథనపడేలా చేసిందని.. దుఃఖం కలిగించే పరిస్థితిని తెప్పిం చిందన్నారు.. వారి పరిస్థితిపై మూడు నాలుగురోజుల్లో మంత్రివర్గ భేటీని ఏర్పాటుచేసి విధాన నిర్ణయం తీసుకుని, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో ప్రకటిస్తామని కేసీఆర్ వెల్లడించారు.
అనాథ బాలికలకు అండగా ఉంటామని, టెన్త్ తర్వాత ఇంటర్, ఆపై చదువులకయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఈ సభకు హాజరు కావడం ద్వారా తన జీవితంలో మరో గొప్ప నిర్ణయం తీసుకునే అవకాశం దొరికిందన్నారు. బాలికల సమస్యలు ఇక్కడికి రావడం ద్వారానే తెలిశాయని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ పోలీస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ పోలీసుల పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు.