సీఎం చదివిన పాఠశాలకు రూ.10 కోట్లు
చురుగ్గా సాగుతున్న కొత్త బిల్డింగ్ పనులు
హర్షం వ్యక్తం చేస్తున్న దుబ్బాక ప్రజలు
దుబ్బాక: సీఎం కేసీఆర్ బాల్యంలో ప్రాథమిక విద్యనభ్యసించిన దుబ్బాక ప్రభుత్వ బాలుర పాఠశాలకు మహర్దశ పట్టనుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దుబ్బాక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో అధునాతన హంగులతో పాఠశాల భవనం నిర్మిస్తున్నారు. కేసీఆర్ దుబ్బాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యనభ్యసించారు.
1969లో ఆయన పదవ తరగతి పూర్తి చేశారు. చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలపై ఆయనకు ప్రత్యేకాభిమానం ఉండటంతో పాఠశాల నూతన భవన నిర్మాణానికి నిధులు కేటాయించారు. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చొరవతో సీఎం కేసీఆర్ ఇటీవల దుబ్బాకలో నిర్వహించిన నియోజకవర్గ సమీక్షా సమావేశంలో తాను చదువుకున్న దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలో నూతన భవనాల నిర్మాణానికి రూ. 10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
పాఠశాలను ఆధునాతన హంగులతో నిర్మించడానికి విద్యా మౌలిక వసతుల కల్పనా సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే సమక్షంలో అధికారులు రూపొందించిన పాఠశాల నమూనాను ఇటీవల సీఎం ఆమోదించారు. కొత్తగా నిర్మించే భవనాల్లో జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాల విద్యార్థులకు సరిపోను విశాలమైన 40 తరగతి గదులకు సంబంధించిన కొలతలను సిద్ధం చేశారు.
పాఠశాల సిబ్బంది కూర్చోవడానికి ప్రధాన కార్యాలయం, విద్యార్థులకు డైనింగ్ హాల్, క్రీడా సామాగ్రిని భద్రపరుచుకోవడానికి స్పోర్ట్స్ గదులు, సైన్స్, మ్యాథ్య్, ల్యాబ్ గదుల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే గ్రంథాలయం పనులు చురుకుగా సాగుతున్నాయి. విద్యార్థులకు తగిన క్రీడా మైదానం సిద్ధం చేస్తున్నారు. సీఎం కేసీఆర్కు సొంత గడ్డపై ఉన్న మమకారంతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు భారీగా నిధులు కేటాయించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మోడల్ స్కూల్ కోసమే ఆధునాతన భవనం
రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా దుబ్బాక ప్రభుత్వ బాలుర పాఠశాలకు సీఎం కేసీఆర్ అత్యధికంగా నిధులు కేటాయించడం సంతోషకరమైన విషయం. కేసీఆర్ బాల్య జీవితంలో దుబ్బాకలో చదువుకోవడం ఈ ప్రాంతం చేసుకున్న అదృష్టం. దుబ్బాకతో కేసీఆర్కు ఆత్మీయ అనుబంధం ఉంది. పాఠశాల నూతన భవన నిర్మాణ విషయమై సీఎంను కలిసిన వెంటనే నిధులు కేటాయించారు. - ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, దుబ్బాక
అనుకున్నది సాధించడం కేసీఆర్ నైజం
కేసీఆర్ విద్యార్థి దశ నుంచే అనుకున్నది సాధించే వారు. ప్రజలతో మమేకమయ్యేవారు. మంచి చదువరి. తోటి విద్యార్థులకు నాయకత్వం వహించే వారు. అప్పటి తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. తాము చదువుకున్న పాఠశాలకు నిధులను కేటాయించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. - బొమ్మెర వెంకటేశం, కేసీఆర్ బాల్య మిత్రుడు