రికార్డ్ స్థాయిలో ఓఎన్జీసీ డ్రిల్లింగ్
501 బావుల డ్రిల్లింగ్
న్యూఢిల్లీ: ఓఎన్జీసీ... బావుల డ్రిల్లింగ్‌లో గత ఆర్థిక సంవత్సరం కొత్త రికార్డ్‌ను సృష్టించింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.15,747 కోట్ల ఖర్చుతో 501 చమురు బావులను డ్రిల్లింగ్ చేసినట్లు ఓఎన్జీసీ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో 386 బావులను డ్రిల్లింగ్ చేశామని ఓఎన్జీసీ సీఎండీ దినేశ్ కె సరాఫ్ చెప్పారు. 500కు మించిన బావులను డ్రిల్ చేయడం 23 ఏళ్లలో ఇదే మొదటిసారని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 490 బావులను డ్రిల్లింగ్ చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించిందని, ఈ లక్ష్యాన్ని దాటేశామని వివరించారు.
డ్రిల్లింగ్ చేసిన 501 బావుల్లో 334 ఆన్‌షోర్, 167 ఆన్‌షోర్ బావులని పేర్కొన్నారు. ముడి చమురు ధరలు తగ్గుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా పలు ఆయిల్ కంపెనీలు తమ అన్వేషణ కార్యకలాపాలను తగ్గించాయని, కానీ తాము అన్వేషణ కార్యకలాపాలను మరింత ముమ్మరం చేయాలని నిర్ణయించామని సరాఫ్ తెలియజేశారు. నిర్వహణ సామర్థ్యం పెంచుకోవడానికి, వ్యయాల నియంత్రణ కోసం గత ఆర్థిక సంవత్సరంలో చాలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. బావులను డ్రిల్లింగ్ చేయడం ద్వారా చమురు నిక్షేపాలను అన్వేషించడం జరగుతుంది.