రూ. 377 కోట్ల రుణమాఫీకి ప్రతిపాదనలు
డీజీఎం సుఖదేవ్‌భవ
రాయదుర్గం : జిల్లా వ్యాప్తంగా సహకార సొసైటీ బ్యాంకు సంఘాల పరిధిలో రూ. 377 కోట్ల రుణాల మాఫీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ట్లు డీజీఎం, నోడల్ ఆఫీసర్ సుఖదేవ్‌భవ తెలిపారు. ఆ దిశగా రైతుల నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యామని ఆయన అన్నారు. రాయదుర్గం జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో గురువారం బ్రాంచి మేనేజర్ వన్నూర్‌స్వామి అధ్యక్షతన రుణమాఫీపై సమావేశం నిర్వహించారు. డీజీఎం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1.39 లక్షల వంది వ్యవసాయ రుణాలు, 17 వేల మంది బంగారు రుణాల మాఫీకి అర్హత కలిగి ఉన్నారన్నారు.
ఇప్పటి వరకు 80 శాతం వరకు ఆధార్, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు అకౌంట్ నంబర్లు, రేషన్‌కార్డుల వివరాలను సేకరించామన్నారు. రాయదుర్గం సహకార బ్యాంకు పరిధిలో ఉన్న 7 ప్రాథమిక సొసైటీ సంఘాల్లో 4 వేల అకౌంట్లు ఉండగా, ఇప్పటికే 3వేల అకౌంట్లకు సంబంధించి వివరాలను పూర్తిస్థాయిలో సేకరించామన్నారు. రైతులు సకాలంలో ఆధార్, రేషన్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్సులను అందజేసి సహకరించాలని కోరారు. సమావేశంలో సొసైటీల సీఈఓలు టీ శ్రీనివాసులు, కుమార్‌మంగళం, జీ రమణారెడ్డి, కేపీ ఆంజనేయులు పాల్గొన్నారు.